వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు నిదర్శనం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
చర్చి శతాబ్ది ఉత్సవాలకు హాజరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ మెదక్ జోన్/చిలిప్‌చేడ్: మెదక్ చర్చి యేసు క్రీస్తుకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన బోధనలకు జీవమిస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. వందేళ్ల విశ్వాసానికి, దేవుని కృపకు ఈ ఆలయం నిదర్శనమని, శాంతిని కోరుకునే వారికి మార్గ నిర్దేశాన్నిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) సంఘ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.
గవర్నర్ రాక పురస్కరించుకుని ప్రెసిబెటరి ఇన్‌చార్జి శాంతయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు కేవలం వందేళ్ల సంబరమే కాదని, మానవ విశ్వాసం, దేవుని అమోఘమైన కృపకు నిదర్శనంగా నిలిచే ఒక మహత్తర ఘట్టమని అభివర్ణిం చారు.
ఈ సందర్భంగా బైబిల్‌లోని.. ‘ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున కూడి ఉంటారో.. అక్కడ నేను ఉంటాను..’అనే క్రీస్తు వచనాలను గవర్నర్ ఉటంకించారు. ఈ చర్చి శతాబ్దంగా దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా నిలిచిందని, ఒక విశ్వాసాన్ని పెంపొందించిన స్థలం గానే కాకుండా, అనేకమంది జీవితాలను మార్చిన ప్రదేశంగా నిలిచిందని చెప్పారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఇంతటి గొప్ప దేవాలయాన్ని మనకు ఇచి్చనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని గవర్నర్ చెప్పారు.
విద్యార్థులు కలలు సాకారం చేసుకోవాలి
విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాది లాంటి వారని, వారు సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, కలలు సాకారం చేసుకోవాలని గవర్నర్ సూచించారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మంచి నాగరికతను పుణికి పుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలని కోరారు.
కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు బ్యాడ్మింటన్ క్రీడ అంటే ఇష్టమని, మాజీ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు ఆదర్శమని తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment