పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని తప్పుబట్టిన హైకోర్టు
మాజీ ఎమ్మెల్యేను అకస్మాత్తుగా ఎందుకు అరెస్టు చేశారు?
కుటుంబ సభ్యులకు చెప్పి చట్టపరంగా అరెస్టు చేయవచ్చు కదా?
ఇతర నిందితుల వాంగ్మూలాలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది.
గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్‌రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.
నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలు వినిపించారు.
పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ
‘నరేందర్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్‌రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు?
రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్‌కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు.
నరేందర్‌రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలి. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.
ప్రాథమిక విచారణ చేశారా?
వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్‌మెంట్లు కాకుండా నరేందర్‌రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది?
లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment