ఎటూ తేల్చుకోలేకపోతున్న సర్కార్
నేటి కీలక భేటీలోనైనా స్పష్టత వచ్చేనా !
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కులగణన చేపట్టాలా..లేదా తాజా ఓటర్లజాబితా ఆధారంగా చేయాలా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోతోంది. స్థానిక రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసి, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలై ఆరునెలలు కావొస్తోంది. ఇక జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల గడువు ఈ నెల 4వ తేదీతో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీలు, 563 మండలాల్లోని దాదాపు 6 వేల ఎంపీటీసీ, 563 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వచ్చే నిధులు ఆగిపోయాయి.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఎలా ?
స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతం రిజర్వేషన్లు ఉండగా, దానిని 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి ఏ పద్ధతి అనుసరించాలనే అంశంపై ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.
సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీకమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిని తేల్చాలని స్పష్టం చేసింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించరాదని కూడా పేర్కొంది.
ఓటర్ల జాబితాతో అయితే...
రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహణ అనేది చాలా ఎక్కువ సమయం పట్టే› ప్రక్రియ. దీంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది.
ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బీసీ సంఘాలు, వివిధ కులసంఘాలు, జిల్లాల్లోని రాజకీయపార్టీలతో సమావేశాలు, బహిరంగ విచారణ, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చునని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఓటర్ల లిస్ట్ ప్రకారమైతే పెద్దగా శ్రమ లేకుండా మూడునెలల్లో క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక, కుల సర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment