సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment