కాసేపు ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
మల్లేపల్లి తెలుగు, ఉర్దూ ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది.
స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు.
ఇన్‌స్పెక్టర్‌కు చురకలు..
మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్‌లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment