సాక్షి, హైదరాబాద్: విత్తనం ఎంత కాలం బతుకుతుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) సహా ఆరు అంతర్జాతీయ సంస్థలు ఇందుకోసం స్వాల్‌బోర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్‌లో పదమూడు రకాల విత్తనాలను వందేళ్ల ప్రయోగాల కోసం నిల్వ చేయనున్నాయి. భవిష్యత్తులో ప్రపంచం మొత్తమ్మీద ఏదైనా పంటను మళ్లీ పునరుద్ధరించేందుకు ఏం చేయాలన్నది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుందని అంచనా. ఇక్రిశాట్‌తోపాటు ఇతర సంస్థల్లోని విత్తన జన్యుబ్యాంకులు ఈ ప్రయో గంలో పాల్గొంటున్నాయి.
మొత్తం 13 రకాల విత్తనాలను స్వాల్‌బోర్డ్‌లోని విత్తన బ్యాంకులో నిల్వ చేయనుండగా ఇందులో నాలుగింటిని ఇక్రిశాట్ సమకూర్చనుంది. వేరుశనగ, జొన్న, కంది, శనగ పంటలను ఇక్రిశాట్ అందజేయనుందని, ప్రయోగం 2022 –23లో మొదలవుతుందని ఇక్రిశాట్‌లోని ఆర్.ఎస్.పరోడా జీన్‌బ్యాంక్ అధ్యక్షుడు డాక్టర్ వానియా అజెవీడో ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన బ్యాంకులో విత్తనాలను –18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారని, పదేళ్లకు ఒకసారి విత్తనాలను వెలికితీసి పరిశీలించి మళ్లీ నిల్వ చేస్తారని వివరించారు. రానున్న మూడేళ్లలో మిగిలిన సంస్థలు మరిన్ని విత్తనాలను నిల్వ చేయనున్నాయి. వీటిలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, టిమోతీ విత్తనాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment