సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్‌ఆర్‌ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు.
కోర్టు ఉత్తర్వులు..
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్‌మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు.
ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment