‘నీట్‌’ అక్రమాలు.. కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్‌ | KTR's Open Letter To Central Government On Neet Exam | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ అక్రమాలపై విచారణ జరపాలి: కేటీఆర్‌ బహిరంగ లేఖ

Published Sun, Jun 16 2024 3:10 PM

Ktr Open Letter To Central Government On Neet Exam

సాక్షి,హైదరాబాద్‌: నీట్‌ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఆదివారం(జూన్‌16) కేటీఆర్‌ ఒక బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఓవైపు  గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నీట్ వ్యవహారంపై స్పందించాలన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేసి వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. 

 కష్టపడి చదివిన  విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని లేఖలో  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు  ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. 

ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు.  అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు  పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.

అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

నీళ్ల కోసం ‘‘క్యూ సెరా.. సెరా’’

భారతదేశంలో రాజకీయ విజయం అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వాస్తవ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గురించి కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. 

ఊహాజనిత సమస్యలు & ఉత్పాదక అవగాహనలతో ఎన్నికలు గెలిచినప్పుడు ఈ వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందన్నారు. వారు చెప్పినట్లు ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో నీళ్ల కోసం "క్యూ సెరా, సెరా"నే అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement