ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో సమావేశమైన అసమ్మతి నేతలు
ఇల్లెందు: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు మరోమారు బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వొద్దని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధిష్టానాన్ని కోరారు. ఎమ్మెల్యే భర్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బానోతు హరిసింగ్ అరాచకాలు మితిమీరాయని, సెటిల్‌మెంట్లు, భూదందాలేకాక సొంత పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో హరిప్రియకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని అన్నారు.
ఈ మేరకు శనివారంరాత్రి ఇల్లెందులోని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు సమావేశమయ్యారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ అ«ధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఇల్లెందు, బయ్యారం సొసైటీల చైర్మన్లు మెట్ల కృష్ణ, మూల మధుకర్‌రెడ్డి, మహబూబాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ అంగోతు బిందు తండ్రి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.
ఇల్లెందులో ఎమ్మెల్యే భర్త తీరుతో బీఆర్‌ఎస్‌కు నష్టం చేకూరుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇల్లెందు అభివృద్ధి నిధులను ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కమీషన్లు పొందారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులను పక్కనబెట్టి పీఆర్ శాఖ ఇంజనీర్లతో సుమారు రూ.30 కోట్ల నిధులతో పనులు చేయించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు సీఎంను కలిసే అవకాశం తమకు లేనందున మీడియా ద్వారా ప్రజలు, సీఎం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. అభ్యరి్ధని మారిస్తే తప్ప ఇల్లెందులో పార్టీ గెలిచే అవకాశం లేదని, అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసా వహిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment