
సాక్షి, హైదరాబాద్: గతంలో హామీయిచ్చినట్లుగా 57 ఏళ్ల నుంచే పెన్షన్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును మూడేళ్లు తగ్గించి... అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలనేది సీఎం ఆలోచనని, కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, ఆరూరు రమేష్, బొల్లం మల్లేష్ యాదవ్‌లు అడిగిన ప్రశ్నలకు ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. పెన్షన్లకు కేంద్రం ఇచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు ఏడాదికి రూ. 11,724 కోట్లు ఖర్చు చేస్తే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 210 కోట్లే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 39.36 లక్షల మందికి ఇస్తే, కేంద్రం 6 లక్షల మందికే ఇస్తోందన్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో వృద్ధులు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మికులకు న్యాయం జరుగుతోందన్నారు. ఒంటరి మహిళలకు 2015 నుంచే పెన్షన్ ఇస్తున్నామన్నారు. కరోనా వల్ల ఏడాది నుంచి కొద్దిగా గ్యాప్ ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment