హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి షాకిచ్చారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతో గవర్నర్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ .. ఇద్దరు సమర్ధవంతులైన వ్యక్తులను ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేసి పంపాం. వారిద్దరూ మంచి పేరున్న నేతలు కాబట్టే ప్రభుత్వం సిఫారసు చేసింది. గవర్నర్ నుంచి పాజిటివ్‌గా రిప్లై వస్తుందని భావించాం. కానీ ఆమె తీరు అస్సలు బాగాలేదు. మేము సిఫారసు చేసిన అభ్యర్థులకు అర్హత లేదంటున్నారు. అసలు మీకు గవర్నర్‌గా అర్హత ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమె ఈ పదవికి అన్ ఫిట్ అన్నారు.
బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉంది ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. ఆమె ఒక గవర్నర్ లా కాకుండా మోడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల హడావిడి మొదలైన తర్వత వీరి హడావుడి మరీ ఎక్కువైంది. మేము అధికారంలోకి వచ్చి తొమ్మిదినర ఏళ్లయింది. ఇప్పటికీ కొంత మందికి పాత అలవాటు పోవటం లేదు. తెలంగాణ పై నిరంతరం విషం చిమ్ముతునే ఉన్నారు.
అక్టోబర్ 1న మోదీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. తెలంగాణ ఏర్పాటుపై మోదీ ఎందుకు నిత్యం విషం చిమ్ముతున్నారు? సందర్భం లేకుండా ప్రతి సారి పగబట్టినట్లు మాట్లాడున్నారు.. అంత అవసరమేముంది? పార్లమెంట్ సాక్షిగా మోదీ అనేక సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా అజ్ఞానంతో మాట్లాడారు. ఆయన మాటలు జ్ఞానం లేదు సరికదా అంతా అజ్ఞానమే కనిపిస్తుందన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ 'అమృత కాలం'లో కొత్త పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలపై విషం చిమ్మారు. 2014, 2018లో బీజేపీ పార్టీ ఎలాగైతే పుట్టగతులు లేకుండా పోయిందో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. దీనిపై కూడా మోదీ తన అక్కసును వెళ్లగక్కారు. అసలు ఉత్సవాలు జరగలేదంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ వెనకబడిన జిల్లాకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి.
జూలై 14,2014 లో కృష్ణా నది వాటా తేల్చాలని అడిగితే ఇప్పటికీ దిక్కులేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు.. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించామని కోరాము. పాలమూరు ఇప్పుడు పచ్చబడుతుంటే బీజేపీకి ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ పక్షపాత ధోరణిలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా పని చేస్తోందన్నారు. అసలు మీది జాతీయ పార్టీయేనా? కాదా? ప్రధాని సమాధానం చెప్పాలన్నారు.
ఇది కూడా చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత
Comments
Please login to add a commentAdd a comment