5 వేల హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేయనున్నారా! | More Than 5 Thousand Headmaster Posts Are Likely To Come | Sakshi
Sakshi News home page

5 వేల హెచ్‌ఎం పోస్టులు!

Published Tue, Apr 6 2021 4:58 AM | Last Updated on Tue, Apr 6 2021 4:59 AM

More Than 5 Thousand Headmaster Posts Are Likely To Come - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరో 5 వేలకుపైగా ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల వరకు హెడ్‌మాస్టర్‌ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన కార్యాచరణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో మొత్తంగా 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,429లో ఫిమేల్‌ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెడ్‌మాస్టర్‌ పోస్టులు ఉన్నాయి. అయితే అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరు చేసినవే. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో అప్పటి ప్రభుత్వం 10,647 ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్‌మాస్టర్‌ పోస్టులను మంజూరు చేసింది. అందులో తెలంగాణలోని పది జిల్లాలకు 4,429 పోస్టులను కేటాయించింది. అందులో మహబూబ్‌నగర్‌కు 580, రంగారెడ్డికి 369, హైదరాబాద్‌కు 168, మెదక్‌కు 426, నిజామాబాద్‌కు 389, ఆదిలాబాద్‌కు 484, కరీంనగర్‌కు 562, వరంగల్‌కు 491, ఖమ్మంకు 460, నల్లగొండకు 500 పోస్టులను కేటాయించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో అవి మాత్రమే ఉన్నాయి.

అయితే ప్రాథమిక పాఠశాలలకు కూడా ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని, లేదంటే వాటి నిర్వహణ సమస్యగా మారడంతోపాటు ఉన్న ఒకరిద్దరు టీచర్లు నిర్వహణ సంబంధ అంశాలపై దృష్టి సారించాల్సి వస్తుండటంతో బోధన దెబ్బతింటోందని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సమయంలో పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్న పోస్టులతోపాటు మరిన్ని పోస్టులను ఇచ్చి ప్రాథమిక పాఠశాలల హెడ్‌మాస్టర్‌ పోస్టులను 10 వేలకు పెంచుతామని ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

ప్రస్తుతం ఉన్న పోస్టులు ఎన్ని? అందులో ఎంత మంది రిటైర్‌ అయ్యారు? ఎన్నింటిలో మళ్లీ నియమించారన్న వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలా గతంలో ఉన్న పోస్టుల ప్రకారం చూస్తే ఇప్పుడు మరో 5,571 ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
చదవండి: హల్ది వాగుకూ జీవం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement