ది డైమండ్.. ఇకపై అందరి నేస్తం.. | Natural Diamonds In Hyderabad City, How Diamonds Growing In Lab And More Details About It | Sakshi
Sakshi News home page

ది డైమండ్.. ఇకపై అందరి నేస్తం..

Published Thu, Jul 4 2024 11:20 AM | Last Updated on Thu, Jul 4 2024 11:38 AM

Natural Diamonds In City

సహజ పద్ధతిలో తయారీ

 సీవీడీ, హెచ్‌పీహెచ్‌టీ వంటి రెండు పద్ధతుల్లో...

ఇకపై అందరికీ అందుబాటులో హైదరాబాద్‌ మార్కెట్‌లో లభ్యం

‘వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన ప్రేమ కూడా అలాగే’ అంటూ ఒక ప్రకటనలో ప్రియురాలి వేలికి ఉంగరం తొడుగుతూ ప్రియుడు చెప్పిన డైలాగ్‌ ఒక తరం మహిళలందరినీ కట్టి పడేసింది. ఆ ప్రకటనలో మహిళ ధరించిన వజ్రపుటుంగరం మహిళాలోకం మదిని దోచుకుంది. ‘వజ్రపుటుంగరం, పైగా అంతపెద్ద వజ్రంతో’ అని ఆ ప్రకటన మగవాళ్ల హార్ట్‌బీట్‌ పెంచింది కూడా... అదంతా ఒకప్పుడు. భూగర్భం నుంచి తవ్వి తీస్తే తప్ప వజ్రం దొరకని రోజుల్లో. ఇప్పుడు మ్యాన్‌మేడ్‌ డైమండ్స్‌ నగరంలోని ఆభరణాల మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఎల్‌జీడీ, ఎకో ఫ్రెండ్లీ డైమండ్, మ్యాన్‌మేడ్‌ డైమండ్‌... పిలిచే పేరు ఏదైనా అది వజ్రమే. సిటీ ఆఫ్‌ పెరల్స్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌ నగరం... ఇప్పుడు మ్యాన్‌మేడ్‌ డైమండ్‌ ఆభరణాల హబ్‌గా మారుతోంది. ఇప్పుడు నగరంలో జరిగే వేడుకల్లో ఎంగేజ్‌మెంట్‌ రింగ్, చెవి  దిద్దులు, గాజుల్లోనూ ప్రధానంగా ఈ వజ్రాలే ఉంటున్నాయి. నగరంలో మ్యాన్‌మేడ్‌ వజ్రాల శకం మొదలైంది. ఈ వజ్రాలు హైదరాబాద్‌ ఆభరణాల మార్కెట్‌ని ముంచెత్తబోతున్నాయి.
– వాకా మంజులారెడ్డి

ఇది మేధో వజ్రం..
ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌... హై ప్రెజర్‌ హై టెంపరేచర్‌ (హెచ్‌పీహెచ్‌టీ), కెమికల్‌ వేపర్‌ డిపాజిషన్‌ (సీవీడీ) అనే రెండు ప్రక్రియల్లో తయారవుతాయి. చిన్న ఉదాహరణ ఏమిటంటే... కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి కోడి 21 రోజులు గుడ్డు మీద పొదగడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. కోడి గుడ్లను కరెంటు బల్బు వేడితో పొదిగించడం మనిషి సాంకేతికతతో కనిపెట్టిన ప్రత్యామ్నాయ మార్గం. ఈ ప్రక్రియలో కోడితో పని ఉండదు, కోడి గుడ్డు ఉంటే చాలు. ఇలాంటిదే లాబ్‌లో పెరిగే వజ్రం కూడా. కార్బన్‌ సీడ్‌ ద్వారా లాబ్‌లో వజ్రాన్ని తయారు చేయగలిగిన సాంకేతికత మనిషి సొంతమైంది. సైంటిస్ట్‌లు, జెమ్మాలజిస్ట్‌ల సంయుక్త పర్యవేక్షణలో డైమండ్‌ గ్రోయింగ్‌ గ్రీన్‌హౌస్‌లో ఈ వజ్రాలు తయారవుతాయి.  

అదే వేడి– అంతే ఒత్తిడి
కార్బన్‌.. వజ్రంగా మారే ప్రక్రియ అంతా భూగర్భంలోనే జరుగుతుంది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన వజ్రం పుట్టుక ఇది. కార్బన్‌ సీడ్‌ని లోహపు పలకం మీద ఉంచి ఐదు వేల డిగ్రీల ఫారన్‌హీట్‌తోపాటు తగినంత ఒత్తిడిని కలిగించడం, మీథేన్‌ వాయువుతో వ్యాక్యూమ్‌ చాంబర్‌లో కెమికల్‌ వేపర్‌ అందించడం ద్వారా పది – పన్నెండు వారాల్లో అచ్చమైన అసలు సిసలైన వజ్రం తయారవుతుంది. భూగర్భం నుంచి తవ్వి తీసిన డైమండ్‌ని మైన్‌డ్‌ డైమండ్‌ అని, డైమండ్‌ గ్రోయింగ్‌ గ్రీన్‌హౌస్‌లో రూపొందిన డైమండ్‌ని మ్యాన్‌మేడ్‌ డైమండ్‌ అని వర్గీకరించవచ్చు. వజ్రం పుట్టుకలో ఉన్న రెండు రకాలివి. వజ్రం చేతికి వచి్చన తర్వాత గ్రేడింగ్, కటింగ్‌ వంటి ప్రక్రియలన్నీ రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన జెమ్మాలజిస్ట్‌ జియా.

సామాన్యుల చెంతకు...
వజ్రాల పరిశ్రమలు థర్మల్‌ కండక్టివిటీ, కటింగ్‌ టూల్స్, హీట్‌ సింక్స్‌ వంటి తమ పారిశ్రామిక అవసరాలకు కూడా మ్యాన్‌మేడ్‌ డైమండ్స్‌ మీదనే ఆధారపడుతున్నాయి. వజ్రాల పరిశ్రమ కూడా మనుషుల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు వాటిల్లని నైతికమార్గంలో తయారవుతున్న వజ్రంగా మ్యాన్‌మేడ్‌ డైమండ్‌నే గుర్తిస్తోంది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన వజ్రం ఇకపై సామాన్యుల చెంతకు చేరనుంది. హైదరాబాద్‌ నగరవాసుల్లో కొనుగోలు శక్తి పెరిగింది. మ్యాన్‌మేడ్‌ డైమండ్‌ కాంతులు యువకుల వేళ్లను మెరిపిస్తున్నాయి, యువతుల చెవులకు సప్తవర్ణ కాంతులను అద్దుతున్నాయి.

ఈకో ఫ్రెండ్లీ..
భూగర్భంలో రూపుదిద్దుకున్న వజ్రాన్ని సేకరించే క్రమంలో వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. గనుల పరిసరాల్లోని వాళ్ల ఆరోగ్యం మీద కూడా దు్రష్పభావాన్ని చూపిస్తాయి. మైనింగ్‌ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తుల ప్రాణాలను కూడా ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ్యాన్‌మేడ్‌ డైమండ్స్‌ని ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్‌నే ప్రోత్సహిస్తున్నారు.

ఫోర్‌ సీలే ప్రామాణికం..
కట్, క్లారిటీ, కలర్, క్యారట్‌... ఇవి నాలుగూ డైమండ్‌కి ప్రామాణికాలు. ఈ నాలుగు ప్రామాణికతల పట్టిక ల్యాబ్‌ డైమండ్‌లోనూ ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని వజ్రాలకు యూఎస్, యూకేలు ఇప్పటికే అధికారిక ఆమోదాన్నిచ్చాయి. గతేడాది భారత ప్రభుత్వం కూడా తన ఆమోదాన్ని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించింది. పర్యావరణహితమైన జీవనశైలిని కోరుకునే వాళ్లు ఈ డైమండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌. విదేశాల నుంచి దిగుమతులను నిలువరిస్తూ దేశీయ అవసరాలకు తగినంత ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరను అందుబాటులోకి తీసుకురావడంతో దేశీయ నిపుణులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారామె.  

ఫ్లాలెస్‌ వజ్రాలివి! 
క్వాలిఫైడ్‌ జెమ్మాలజిస్టుగా నా పాతికేళ్ల అనుభవంలో నేను గుర్తించిదేమిటంటే... ఫ్లాలెస్‌ డైమండ్స్‌ మ్యాన్‌మేడ్‌లోనే వస్తున్నాయి. భూగర్భంలో కార్బన్‌ వజ్రంగా మారే క్రమంలో వజ్రంలో ఇన్‌క్లూజన్స్‌(ధూళి రేణువులు చేరి చుక్కలు, సన్నని గీతలుగా కనిపించడం) ఏర్పడుతుంటాయి. వందలో ఒకటి – రెండు మాత్రమే ఫ్లాలెస్‌ వజ్రాలుంటాయి. మ్యాన్‌మేడ్‌ డైమండ్స్‌లో సగానికి పైగా ఫ్లాలెస్‌ క్వాలిటీతో ఉంటున్నాయి. కార్బన్‌ వజ్రంగా మారడానికి ఏర్పాటు చేసిన గ్రీన్‌హౌస్‌లు స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగి ఉండడం కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. 

ఒకప్పుడు వజ్రం అంటే భూగర్భం నుంచి తవ్వి తీసినది మాత్రమే కావడంతో లభ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడు మార్కెట్‌ అవసరాలకు తగినన్ని వజ్రాలు తయారవుతున్నాయి. ధర విషయానికి వస్తే... మైనింగ్‌ ఖర్చులు కలుపుకుని ధర నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి మైన్‌డ్‌ డైమండ్‌ ధర ఎక్కువగా ఉంటుంది. మైనింగ్‌ ఖర్చులు లేకపోవడంతో మ్యాన్‌మేడ్‌ డైమండ్స్‌ ధర మైన్‌డ్‌ డైమండ్‌తో పోలిస్తే తక్కువగా ఉంటోంది. అదే క్వాలిటీతో ధర తక్కువలో లభిస్తుండడంతో వజ్రాన్ని ధరించాలనే వారి కల సులువుగా నెరవేరుతోంది.  
– జియా, జెమ్మాలజిస్ట్, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement