
లక్షల మంది ఫ్రెండ్స్.. కొన్ని మిలియన్లు సభ్యులున్న అదొక మాయలోకం. కొందరు దీనిని మంచితోపాటు చెడు కోసం కూడా వినియోగించుకుంటున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్‌లో సరదాగా మొదలైన బ్రౌజింగ్‌తో తెలియకుండానే యువత విష వలయంలో చిక్కుకుంటోంది.
సాక్షి,నేరడిగొండ(అదిలాబాద్): ప్రస్తుతం విద్య నుంచి మొదలు సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, శుభాకాంక్షల వరకు.. ఇలా అన్నింటికి కేరాఫ్ అడ్రస్‌గా సోషల్ నెట్‌వర్కింగ్ నిలుస్తోంది. స్నేహ బంధాలకు కాస్తా సాంకేతికతను జోడిస్తే వచ్చిందే ఫేస్‌బుక్. యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న సైట్లలో ఇదొకటి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫేక్‌ఐడీలు సృష్టించి తప్పుడు పోస్టులు చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి. జిల్లాలో గతంలో ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్‌నెట్ వర్కింగ్ సైట్లు
కాలం మారినకొద్ది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ను ఉర్రూతలూపుతున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు యువతను కట్టిపడేస్తున్నాయి. తమ మనసులోని మాటలు, అభిప్రాయాలు ఏ రోజుకారోజు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోకుండా నిద్రపోని వారు ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు. ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఏదో ఒకటి పోస్ట్ చేస్తేనే కాసంత సరదా లభిస్తుందని చెబుతున్నారు. (చదవండి: Viral Video: క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయ తిన్న పోలీస్.. హిజ్రాతో పాటు ముగ్గురిని.. )
అద్భుతమైన ఫామ్‌గా ఫేస్‌బుక్
సుదూర తీరాల్లో ఉన్న స్నేహితులను కలుపుతూ జీవితంలో మధుర జ్ఞాపకాలు పంచుకునేందుకు అద్భుతమైన ఫామ్‌గా ఫేస్‌బుక్ నిలుస్తోంది. స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుపుకోవడం, మనసులోని మాటలను రాతపూర్వకంగా చెప్పగలడంలో ఫేస్‌బుక్ ప్రధానంగా నిలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా నిరంతర మార్పులు చేసుకుంటూ కొత్త హంగులతో ముందుకు సాగుతోంది. స్నేహితులందరూ కమ్యునిటీ పోర్టల్‌గా ఏర్పడి సభ్యత్వం తీసుకుంటే ఉత్తర, ప్రత్యుత్తరాలు చేసుకోవడం ఫేస్‌బుక్‌లో చాలా సులభం. విదేశాలతోపాటు ఇత ర రాష్ట్రాల్లో ఉండే స్నేహితులు, బంధువులకు క్షణా ల్లో సమాచారాన్ని చేరవేసే సాధనంగా పనిచేస్తుండడంతో రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. ఫేస్‌బుక్ మిస్ అయిన ఫ్రెండ్స్‌ను కలవచ్చు. స్నేహితులు, బంధువులతో నిత్యం కాంటాక్ట్‌లో ఉండవచ్చు. ఫేస్‌బుక్ ద్వారా వివిధ సంఘటనలు, విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి.
విష వలయంలో..
లక్షల మంది ఫ్రెండ్స్.. కొన్ని మిలియన్లు సభ్యులున్న ఫేస్‌బుక్ ఓ మాయలోకం. కొందరు దీనిని మంచితోపాటు చెడు కోసం కూడా వినియోగించుకుంటున్నారు. సోషల్ నెట్‌వర్కింగ్‌లో సరదాగా మొదలైన బ్రౌజింగ్‌తో తెలియకుండానే యువత విష వలయంలో చిక్కుకుంటోంది. ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో సరదా అంశాలే తప్ప వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకుండా ఉంటేనే మంచిదని వ్యక్తమవుతుంది.
జాగ్రత్తలు పాటిస్తే మేలు
ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తున్న సమయంలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలు ఫేస్‌బుక్‌లో పెట్టడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆన్‌లైన్ వెబ్‌కెమెరాల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. ఫేస్‌బుక్ వరల్డ్ పేజీలో ఉన్న సమాచారాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. పర్సనల్ ఫొటోలు పెట్టకపోవడమే ఉత్తమం. సోషల్‌నెట్‌వర్క్‌కు బానిసలుగా మారకూడదు.
ఫేస్‌బుక్ ద్వారా జిల్లా వాసికి రూ.1.80 లక్షల టోకరా
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్ నరేందర్ అనే యువకుడు గత నెల 28న ఫేస్‌బుక్‌లో ట్రాక్టర్ విక్రయానికి సంబంధించిన సమాచారం చూశాడు. ఆ ట్రాక్టర్ తనకు కావాలని యజమానితో ఫేస్‌బుక్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఆర్మీ అధికారి అని చెప్పి పాన్‌కార్డు, ఆర్మీకార్డ్ చిత్రాలను ఫోన్ ద్వారా చూపించాడు. రూ.2 లక్షల విలువైన ట్రాక్టర్ అని చెప్పి రూ.1.60 లక్షలకు విక్రయించడానికి బేరం కుదిరింది. విడతల వారీగా ఆయన బ్యాంక్ ఖాతాలో వేశాడు. ట్రాక్టర్ బీమా కోసం ఇంకో రూ.24 వేలు కావాలని ఆ వ్యక్తి అడగడంతో అనుమానం వచ్చి నాకు నీ ట్రాక్టర్ అవసరం లేదని, డబ్బులు తిరిగి పంపించాలని యువకుడు చెప్పాడు. చివరకు నిండా మునిగానని తెలుసుకుని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.