ఓటీపీ చెబితేనే.. వంటగ్యాస్‌ | New Rules For LPG Gas Cylinder OTP Is Must To Get Cylinder | Sakshi
Sakshi News home page

ఓటీపీ చెబితేనే.. వంటగ్యాస్‌

Published Mon, Aug 31 2020 8:22 AM | Last Updated on Mon, Aug 31 2020 12:19 PM

New Rules For LPG Gas Cylinder OTP Is Must To Get Cylinder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వంట గ్యాస్‌ బుక్‌ చేసినా.. ఇంటికి సిలిండర్‌ డెలివరీ కాలేదా?.  డెలివరీ కాకుండానే పక్కదారి పట్టిందా? డోంట్‌వర్రీ. ఇక నుంచి ఓటీపీ చెబితేనే సిలిండర్‌ డెలివరీ అవుతుంది. ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించేందుకు, వినియోగదారులకు సక్రమంగా సిలిండర్లు అందించేందుకు ఆయిల్‌ కంపెనీలు చర్యలు చేపట్టాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే సిలిండర్‌ పంపిణీ చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాయి. నగరంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతి అమలు ప్రారంభమైంది.  సాధారణంగా మొబైల్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేస్తే ఆ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అంటే సిలిండర్‌ బుక్‌ చేసినట్లు లెక్క. ఇలా బుక్‌ చేసిన సిలిండర్‌ సదరు వినియోగదారుడికే చేరుతుందా? లేక బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోందా? అనే అనుమానాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలు ఇకపై ఓటీపీ చూపిస్తేనే సిలిండర్‌ డెలివరీ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేశారు. డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెబితే దానిని అతని దగ్గర ఉండే ఫోన్‌లో నమోదు చేసుకుని సిలిండర్‌ అందజేస్తాడు. దీంతో బుక్‌ చేసుకున్న కస్టమర్‌కే సిలిండర్‌ అందుతుంది. అంతేకాదు కరోనా నేపథ్యంలో డోర్‌ డెలివరీ బాయ్‌కి నగదును నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటును కూడా గ్యాస్‌ సరఫరా సంస్థలు కల్పించాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించిన తర్వాత జనరేట్‌తో పాటు డెలివరీ అక్నాలెడ్జిమెంట్‌  కోడ్‌ (డీఏసీ) వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో పంపించి దాని ఆధారంగా సిలిండర్‌ డెలివరీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ 
గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్,  బిల్లు చెల్లింపు విధానాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయిల్‌ కంపెనీలు అప్‌డెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది.  గతంలో డీలర్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి గాని, నేరుగా వెళ్లి గాని సిలిండర్‌ బుక్‌ చేసుకునే వారు. ఆ తర్వాత మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఐవీఆర్‌ఎస్‌ విధానం అమలులోకి వచ్చింది. ఇటీవల యాప్‌ల ద్వారా బుక్‌ చేస్తున్నారు. ఇందుకోసం పలు గ్యాస్‌ సరఫరా సంస్థలు యాప్‌లను ప్రవేశపెట్టాయి. అమెజాన్‌ ద్వారా రీఫిల్‌ బుక్‌ చేసిన వారికి రూ.50 రాయితీ కూడా ప్రకటించింది. తాజాగా కొత్తగా ఓటీపీ విధానం అమల్లోకి వచ్చింది.   

ఆన్‌లైన్‌ చెల్లింపులకు ప్రాధాన్యం 
తాజాగా ఏజెన్సీలు నగదు చెల్లింపులకు కూడా చెక్‌ పెడుతూ వాట్సాప్‌ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రిజిస్టర్‌ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్‌ నంబర్లకు హాయ్‌ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్‌ పే  ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. వినియోగదారులకు మరింత అవగాహన పెంచడం ద్వారా డిజిటల్‌ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement