సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో నిందితులు, గత దర్యాప్తు అధికారులు కలిసి చేసిన కుట్రను మరింత కొనసాగించేందుకు కొందరు పెద్దలు సిద్ధం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. బినామీ ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ పెద్దలు మధ్యవర్తులతో మళ్లీ వాటిని చేతుల్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తిలా పాపం తలా పిడికెడు లెక్కన కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆయన్ను కాపాడేందుకు కంకణం...
అగ్రిగోల్డ్ కేసులో బినామీ ఆస్తులను గుర్తించకపోవడం, అటాచ్‌మెంట్ చేయకుండా ఉండేందుకు గత దర్యాప్తు అధికారికి చేరిన రూ. కోటి వ్యవహారంలో ఇప్పుడు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణకు ఆదేశాలివ్వాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీస్ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
బినామీ ఆస్తులు కొనుగోలు వ్యక్తికి...: అగ్రిగోల్డ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఏడాది తిరగకుండానే 200 శాతం ఎక్కువ ధరకు అమ్మకం సాగించిన ఓ మాజీ కానిస్టేబుల్‌ను కాపాడేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగడం ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది. ఆయనతోపాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సైతం రంగంలోకి దిగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
బినామీ ఆస్తులు రిజిస్ట్రేషన్‌తోపాటు చేతులు మారకుండా ఉండేందుకు ఐజీ (స్టాంపులు–రిజిస్ట్రేషన్)కి సీఐడీ రాసిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సైతం ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఓ మాజీ కానిస్టేబుల్‌కు బడా రాజకీయ నాయకులతో సంబంధం ఏమిటన్న దా నిపై ఇప్పుడు పోలీస్ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలి సింది. బినామీ ఆస్తుల బదలాయింపులకు, వారికి సంబంధం ఏమిటన్న అంశాలపై కూపీలాగే పనిలో పోలీస్ పెద్దలున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మధ్యవర్తుల పేరిట అగ్రిగోల్డ్ పెద్దలు...
అగ్రిగోల్డ్ సంస్థ నుంచి డబ్బులు పెట్టుబడిగా పెట్టించి బినామీ కంపెనీలపై భారీగా భూములు కూడబెట్టిన అగ్రిగోల్డ్ పెద్దలు వాటిని తిరిగి చేతికి వచ్చేలా చేసుకోవడంలో మధ్యవర్తులను ఉపయోగించుకున్నట్టు సీఐడీ దర్యాప్తులో తేలింది. తక్కువ ధరకే బినామీ కంపెనీల పేరిట ఉన్న భూములను అమ్మకం జరిపించి, కొద్ది రోజుల వ్యవధిలోనే మరో మధ్యవర్తి కంపెనీకి ఆ భూములను రేటు పెంచి కొనుగోలు చేసేలా ఇటు గత దర్యాప్తు అధికారులను, అటు ప్రజాప్రతినిధులను అగ్రిగోల్డ్ పెద్దలు ఉపయోగించుకుంటున్నట్టు సీఐడీ పునర్విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment