సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు.. ఉద్యోగ నియామకాల్లో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగం కావడం వల్ల ఇతర జిల్లాల వారూ రంగారెడ్డి జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగరీత్యా దీర్ఘకాలం ఇక్కడే స్థిరపడడంతో వారి పిల్లలూ స్థానికులుగా గుర్తింపు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్పుడు ఆంధ్ర, రాయలసీయ జిల్లాలకు చెందినవారు అప్పట్లో ఉద్యోగాలు పొంది ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నారు.
తాతల కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలో హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ ఇచ్చే జిల్లాల్లో రంగారెడ్డి కూడా ఉంది. ఈ కారణంగా స్థానికేతరులు కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఈ జిల్లానే ఎంచుకుంటున్నారు. గత ఏడాది అమలు చేసిన 317 జీఓ తర్వాత స్థానికులకు సరైన అవకాశాలే లేకుండాపోయామని ఆ జిల్లావాసులు చెబుతున్నారు. ఉదాహరణకు స్కూల్‌అసిస్టెంట్ బయోసైన్స్‌లో రంగారెడ్డికి, మహబూబ్‌నగర్‌లోని 64 మండలాల నుంచి కేడర్‌కు మించి కేటాయించారు.
ఇతర సబ్జెక్టుల్లో కూడా కేడర్‌కు మించి టీచర్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే స్పౌజ్ కోటాతో సమస్య మరింత జటిలమైంది. భర్త, లేదా భార్య ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు చూపించి దాదాపు 400మంది ఇదే జిల్లాకు వచ్చారు. దీర్ఘకాలం వీరు కొనసాగడం వల్ల ఖాళీలు లేకుండా పోయాయి. దీంతో టెట్, జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు పాసైన స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment