రాజమహేంద్రవరం రూరల్: పుంగనూరులో రెచ్చగొట్టేలా మాట్లాడి విధ్వంసానికి కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏ1గా కేసు నమోదు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముందే నిర్ణయించిన షెడ్యూల్ రూట్‌లో వెళ్లకుండా, ఎందుకు పుంగనూరులోకి ప్రవేశించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఇది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్రేనని అన్నారు. బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలు వారికి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసులు సహా 50 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. పోలీసులపై దాడి, పోలీసు వాహనాల విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని.. సీసీ పుటేజ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment