– రెస్టారెంట్లో తప్పనిసరి ట్రెండ్
– కొత్త రుచులను ఆస్వాదిస్తున్న నగరవాసులు
– రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం
– ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా మన చేతికిచ్చే మెనూలో మొదట కనిపించేది సూప్స్ అండ్ స్టార్టర్స్. ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ఈ ట్రెండ్.. ప్రస్తుతం తప్పనిసరైంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూప్స్ నగర జీవన శైలిలో భాగమయ్యాయి. ప్రస్తుతం ఆహార ప్రియులు రెస్టారెంట్లలో తమకు నచ్చిన సూపులను ఓ సూపు సూస్తున్నారు. విభిన్న ఫ్లేవర్స్ జిహ్వకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక పోషక విలువలు కలిగిన సూప్స్ చక్కని ఆరోగ్య ఫలితాలనూ అందిస్తున్నాయి.
ఆకలి తీర్చడమే కాకుండా ఆకలిని పెంచడంలోనూ సూప్స్‌ది ప్రత్యేక స్థానం. వెజ్, నాన్‌వెజ్ రూపాల్లో లభించే సూప్స్‌లో విభిన్న రకాలున్నాయి. ప్రాంతం, ఆహారపు అలవాట్లను బట్టి వివిధ దేశాల్లో వివిధ రకాల సూప్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక నగరాల్లో అయితే అన్ని రకాల సూప్స్ అందుబాటులో ఉంటాయి. ఇండియన్, చైనీస్ సూప్‌లతో పాటు ఈ మధ్య కొరియన్ సూప్స్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి.
మిరియాలు, దోసకాయ, పాలు, నిమ్మరసం, పెరుగు, క్యారెట్, నువ్వులు, పాలకూర, అల్లం, రైస్ వెనిగర్ పదార్థాలతో తయారు చేసిన సూప్‌లు శరీరంలోని పోషకాలను, ఎలక్రో్టలైట్‌లను పెంపొందిస్తాయని ప్రముఖ చెఫ్ మంగ అశోక్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ వేదికగా తయారు చేసే సూప్స్‌లో సీజనల్‌గా ఆరోగ్యానికి సహకరించే మిరియాలు, అల్లం వంటి పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నామని అన్నారు. ఎండలో డీహైడ్రేషన్‌కు, చలికాలం గొంతు ఇన్ఫెక్షన్లకు సూప్స్ చక్కని ఉపశమనం. గుండె నరాలు, మధుమేహం నిర్వహణలోనూ మనకు సాయపడతాయని అశోక్ చెబుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసుకునేందుకు అనువైన కొన్ని సూప్స్ గురించి తెలుసుకుందాం.
హైడ్రేటింగ్ కోసం దోస–అవకాడో..
దోసకాయ, అవకాడో కలిపి చేసిన సూప్ హైడ్రేటింగ్ శక్తినిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ సూప్ తయారీలో అవకాడోలు, దోసకాయలు, పెరుగు/కొబ్బరి పాలు, నిమ్మరసం, జీలకర్ర, మిరియాలు, పుదీనా కలపాలి. చల్లని సూప్‌లో కొత్తిమీర కూడా చేర్చాలి. ఇది కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రధాయిని. క్యారెట్లు, దుంపలు, నిమ్మకాయ కలుపుకుంటే రుచి మారుతుంది.
జరు సోబా
జరు సోబా అనేది సంప్రదాయ సూప్‌ల మాదిరిగా కాకుండా..ఉడకబెట్టిన పులుసు ఆధారిత సూప్. చల్లబడిన బుక్‌వీట్ నూడుల్స్‌తో తయారు చేసే జపనీస్ వంటకం ఇది. సాస్‌తో వండే ఈ సూప్ సోయా, డాషి, మిరిన్ నుంచి తయారు చేస్తారు. ఈ చల్లని సూప్ తక్కువ కేలరీలతో హృదయనాళ ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మధుమేహం నిర్వహణలో సహాయపడుతుంది. ఉడికించిన నూడుల్స్‌ను చల్లటి నీటితో శుభ్రం చేశాక అవి దృఢంగా మారతాయి.
తియ్యగా.. కారంగా.....
తియతియ్యగా, కారంగా నాలుకకు రుచినందించే వినూత్న సూప్..టమాట–మిరియాల సూప్. దక్షిణాదిలో ఎక్కువ ఆదరణ ఉన్న ఈ సూప్‌ను రసంగానూ వాడుకోవచ్చు. జలుబుకు నివారణగా నాలుకపై టేస్ట్ బడ్స్ మేల్కొల్పడానికి, చలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మిరియాల రసం, జీర రసం, టమాట రసం, మిలాగు రసం, తక్కలి రసం, టమాట మిరియాల చారు వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇందులో మంచి రుచి కోసం వెల్లుల్లి, మిరియాలు, జీలకర్రను వినియోగిస్తారు. రుచుల సమ్మేళనాన్ని సమతుల్యం చేయడానికి కాస్త బెల్లంతో తీపి చేస్తారు. సీజనల్ ఇన్ఫెక్షన్‌లు తగ్గించడానికి ఇదొక చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment