సాక్షి, హైదరాబాద్ : ఇటీవలి వరదల్లో హైదరాబాద్‌లో జలవిలయంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జనం కడగండ్లు, వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు ప్రధాన నగరాల్లో చెరువుల కబ్జాలు, కాల్వల ఆక్రమణల కారణంగా నివాస ప్రాంతాలన్నీ నీటమునిగిన నేపథ్యంలో ప్రధాన శాఖలతో కలిసి చెరువుల పరిరక్షణ చట్టం రూపొందించే కసరత్తు మొదలుపెట్టింది. కబ్జా చేస్తే నేరుగా కటకటాల్లోకి నెట్టేలా, అక్రమ నిర్మాణాలు చేస్తే వారంట్‌లు లేకుండా అరెస్ట్‌లు చేసేలా... కఠిన చర్యలకు వీలుకల్పిం చే చట్టాన్ని రూపొందించే పనిలో పడింది.
అటు కబ్జాలు..ఇటు కన్నీళ్లు
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో... చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేలాది చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువు పూర్తి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకుపోయిందని నిర్ధారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని, ఫీడర్ చానళ్లు, కాల్వలన్నింటినీ ఆక్రమించారని గుర్తించింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఇది ఎక్కువని తేల్చింది.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 185 చెరువులు ఉండగా ఇందులో సగం చెరువులు ఆక్రమణ దారుల గుప్పిట్లో ఉన్నాయని, 70 శాతానికి మించి చెరువులు కుచించుకుపోయాయని గుర్తించింది. భారీ వరద కొనసాగినప్పుడు కబ్జాల కారణంగా చెరువుల నుంచి నీరు బయటకి వెళ్లే మార్గాల్లేక కట్టలు తెగుతున్నా యి. ఇటీవలి వర్షాలతో గ్రేటర్ పరిధిలోనే 50 చెరువులు దెబ్బతినగా, 20 చెరువులు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మీర్‌పేటలోని పెద్దచెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, మియాపూర్‌లోని కొత్తకుంట, గగన్ పాడ్‌లోని మామాడికుంట, షేక్‌పేటలోని శాతం చెరువు, అనుంగని చెరువులు ఎక్కువగా దెబ్బతినగా వీటి మరమ్మతులకే రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.
మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 35 వేలకు పైగా కుటుంబాలు కొన్ని వారాల పాటు నీటి ముంపుతో అల్లల్లాడాయి. నాలాల పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించడం ద్వారా గ్రేటర్ పరిధిలో వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని, తద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు ఇంజనీర్లు, నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపల్, జీహెచ్‌ఎంసీలు కలిసి చెరువుల రక్షణకు కొత్తచట్టాన్ని ఓ కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి.
అవసరమైతే పీడీ యాక్ట్
చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. నీటి వనరులు కాపాడేలా గతంలో పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలు చేసిన సిఫార్సులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరువుల ఆక్రమణల నివారణ చట్టాలను అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకు చట్టంలోపొందుపర్చనున్న అంశాలివీ...
►ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందిస్తోంది.
►చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠినచర్యలుంటాయి.
► చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించొద్దు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు.
► చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహమార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురద, రసాయన వ్యర్థాలను చెరువులో వేయొద్దు.
► ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టొద్దు.
► శుద్ధి చేయని జలాలను చెరువుల్లోకి పంపొద్దు.
► వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు.
► ఆక్రమణదారులను ఎలాంటి వారంట్ లేకుండానే అరెస్టు చేసే, పీడీ యాక్టు పెట్టే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment