పరస్పర బదిలీలకు ఓకే! | Telangana: Govt Accepts Employees Mutual Transfer Nod For Inter Local Cadre | Sakshi
Sakshi News home page

పరస్పర బదిలీలకు ఓకే!

Published Thu, Feb 3 2022 2:24 AM | Last Updated on Thu, Feb 3 2022 8:36 AM

Telangana: Govt Accepts Employees Mutual Transfer Nod For Inter Local Cadre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఒక లోకల్‌ కేడర్‌ నుంచి మరో సమాన లోకల్‌ కేడర్‌కు పరస్పర బదిలీకి అనుమతిచ్చింది. ఒకే శాఖలో సమాన హోదా పోస్టులు కలిగిన ఇద్దరు వ్యక్తులు, వేర్వేరు సమాన లోకల్‌ కేడర్‌లో పనిచేస్తుంటేనే పరస్పర బదిలీకి అర్హులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు (జీవో నం.21) జారీ చేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం కొత్త లోకల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తైన తర్వాత ఉద్యోగవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీల కోసం ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏ దరఖాస్తునైనా తిరస్కరించేందుకు చాన్స్‌ ఉంది. 

ఇద్దరిలో ఒక్కరు బదిలీ అయి ఉండాలి 
► పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరైనా, కొత్త లోకల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపుల్లో స్థాన చలనం పొంది ఉండాలి.  
► ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు సమాన మేనేజ్‌మెంట్‌(ప్రభుత్వ/జెడ్పీ), సమాన హోదా, సమాన సబ్జెక్టు, సమాన మాధ్యమానికి లోబడి పరస్పర బదిలీకిఅర్హులు.  జిల్లా పరిషత్, మండల పరిషత్,   
ఇతర స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని అలాంటి ఇతర జిల్లా పరిషత్, మండల పరిషత్, ఇతర స్థానిక సంస్థలకు మాత్రమే బదిలీ చేస్తారు.  
సీనియారిటీ వదులుకోవాల్సిందే.. 
►  పాత లోకల్‌ కేడర్లలోని సీనియారిటీ హక్కులను వదులుకోవడంతో పాటు కొత్త లోకల్‌ కేడర్లలో చివరి ర్యాంకును పొందేందుకు అంగీకారం తెలుపుతూ పరస్పర బదిలీ కోరే ఇద్దరు వ్యక్తులూ నిర్దేశిత నమూనాలో రాతపూర్వక హామీ ఇవ్వాలి. కొత్త లోకల్‌ కేడర్లలోని చివరి రెగ్యులర్‌ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంక్‌ను పరస్పర బదిలీపై వెళ్లే ఉద్యోగులకు కేటాయించనున్నారు.  
►   విజ్ఞప్తి మేరకు బదిలీ చేస్తున్న నేపథ్యంలో ఉద్యో గులు ఎలాంటి టీఏ, డీఏలకు అర్హులు కారు.  
► కోర్టు ఆదేశాల మేరకు పాత కేడర్లలో కొనసాగుతున్న ఉద్యోగులు, సస్పెన్షన్‌లో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు, పాత కేడర్లలో అనధికారికంగా గైర్హాజరవుతున్న వారు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. 
ఒక్కరికే సమ్మతి ఇవ్వాలి 
►   ఒక ఉద్యోగి ఇతర సమాన లోకల్‌ కేడర్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది.  
► ఆన్‌లైన్‌ ద్వారా పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకుని హార్డ్‌ కాపీని సంబంధిత శాఖకు జిల్లా/జోనల్‌ అధిపతి ద్వారా పంపించాలి. ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మరో దరఖాస్తుకు అవకాశం ఉండదు. సరైన సమాచారం ఇచ్చే విషయంలో పూర్తి బాధ్యత ఉద్యోగులదే.  
►  సంబంధిత విభాగాధిపతి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర ప్రతిపాదనలను శాఖ కార్యదర్శికి సమర్పించాలి. సాధారణ పరిపాలన శాఖ అనుమతితో శాఖ కార్యదర్శి పరస్పర బదిలీలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.  
దరఖాస్తు ఎలా చేయొచ్చు.. ఎలా చేయకూడదు 
►  స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న ఉపాధ్యాయుడు సమాన స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులో ఉన్న మరో ఉపాధ్యాయుడి పోస్టు కోసమే దరఖాస్తు చేసుకోవాలి.  
► స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) తెలుగు మాధ్యమం పోస్టులోని ఉపాధ్యాయుడు స్కూల్‌ అసిస్టెంట్‌ (గణితం) ఆంగ్ల మాధ్యమం పోస్టులోని మరో ఉపాధ్యాయుడి పోస్టుకు దరఖాస్తు చేసుకోరాదు.  
►  రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులోని ఉద్యోగి అదే శాఖలోని మరో ఉద్యోగికి సంబంధించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు.  
►  వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌ పోస్టులో ఉన్న ఉద్యోగి పంచాయతీరాజ్‌ శాఖలోని సూపరింటెండెంట్‌ పోస్టులోని మరో ఉద్యోగి పోస్టు కోసం దరఖాస్తు చేసుకోరాదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement