రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది? : తెలంగాణ హైకోర్టు | Telangana High Court Clarifies Statement About Liquor Stores | Sakshi
Sakshi News home page

Telangana High Court: రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది?

Published Wed, Nov 24 2021 2:19 AM | Last Updated on Wed, Nov 24 2021 7:14 PM

Telangana High Court Clarifies Statement About Liquor Stores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం దుకాణాల కేటాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయించాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. ఈ మేరకు వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదని అభిప్రాయపడింది.

విద్య, ఉద్యోగ రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాలు కేటాయించేలా ఆదేశించాలంటూ తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు.

ఇదే ప్రాతిపదికన మద్యం దుకాణాల్లో అంతే శాతం రిజర్వేషన్‌ కేటాయించేలా ఆదేశించాలని కోరారు. ‘మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రభుత్వం ఉదారంగా కల్పించింది. రాజ్యాంగంలో, చట్టంలో ఎక్కడా రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు. రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమే. ఇలా రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదు’అని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇదిలా ఉండగా, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు మద్యం దుకాణాలను కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన భూక్యా మంగీలాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement