సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్‌కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్‌కు బదలాయించారని చెప్పారు.
‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు.
ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment