
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వ్యవసాయానికి అనుబంధంగా అభివృద్ధి చెందుతున్న పాడి రంగాన్ని కచ్చితమైన ఆదాయ వనరుగా మలచుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, ఇతర అధికారులతో కలసి మంత్రి తలసాని గురువారం పాడిరంగం అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు, చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. తలసాని మాట్లాడుతూ...పాడి పశువుల కొనుగోలు, పశువుల కొట్టాల నిర్మాణం, బీమా వంటి వాటి కోసం రుణ మార్గాలను కూడా అన్వేషించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పాల ఉత్పత్తి దారుల సహకార సంఘా లు, బ్యాంకులు, పాల ఉత్పత్తి దారుల మధ్య ఒప్పందం కు దుర్చుకునేలా మార్గం సుగమం చేయాలని సూచించారు.