రుణ సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌  | Telangana RBI Holding Vehicle Auction On June 7th | Sakshi
Sakshi News home page

రుణ సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ 

Published Sat, Jun 4 2022 4:16 AM | Last Updated on Sat, Jun 4 2022 3:44 PM

Telangana RBI Holding Vehicle Auction On June 7th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించే బాండ్ల వేలంలో పాల్గొని ఖజానాకు రుణం సమీకరించుకునేందుకు తెలంగాణను ఎట్టకేలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఈ నెల 7వ తేదీన జరగనున్న వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు రాష్ట్రానికి అవకాశం ఇస్తూ ఆర్బీఐ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్ల విలువైన బాండ్లను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయనుంది. తెలంగాణతో పాటు ఏపీ రూ.2 వేల కోట్లు, మహారాష్ట్ర రూ.4 వేల కోట్లు, తమిళనాడు రూ.2 వేల కోట్లు వేలం ప్రక్రియ ద్వారా సమీకరించుకోనున్నాయి.  

ఎఫ్‌ఆర్‌బీఎం మెలిక! 
ఆర్బీఐ వేసే బాండ్లు, సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రుణాలు సమీకరించుకునే సంప్రదాయం చాలా కాలంగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు, ఏర్పాటైన తర్వాత గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఈ ప్రక్రియ సజావుగానే సాగింది. కానీ 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ బాండ్ల వేలం విషయంలో మెలికలు పెట్టింది.

వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే బడ్జెట్‌ వెలుపలి (ఆఫ్‌ బడ్జెట్‌) అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనికి చేర్చడంతో తెలంగాణకు గత రెండు నెలలుగా వేలంలో పాల్గొనేందుకు అనుమతి లభించలేదు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.11 వేల కోట్ల మేర రుణాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ఖజానా కటకటలాడే పరిస్థితికి వచ్చింది. ప్రతి నెలా రూ.10–12 వేల కోట్ల వరకు వచ్చే రెవెన్యూ రాబడులతోనే సర్దుకోవాల్సి వచ్చింది. జూన్‌ నెలలో కూడా ఇలాగే కొనసాగితే సంక్షేమ పథకాలకు ఇబ్బంది పడే స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుందని అధికారులు తెలిపారు.  

వ్యూహాత్మకంగా ఆర్థిక శాఖ పావులు 
రెండు నెలల కఠిన పరీక్షను ఎదుర్కొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ విషయంలో కేంద్రంతో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు విషయాలను వెల్లడించడంతో పాటు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖతో మంతనాలు జరిపింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారుల భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించారు.

ఆ తర్వాత నాలుగు సార్లు కేంద్రానికి లేఖలు రాశారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిబంధనల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. తాజాగా ఇచ్చిన వెసులుబాటుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, రైతుబంధు వంటి కార్యక్రమాలకు నిధుల ఇబ్బంది కాస్త తగ్గినట్టేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement