
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కూలంకషంగా చర్చించి, అమలు చేసే తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ రెండింటితో పాటు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వ్యయం ఎంత అవుతుంది.? ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా 4వ తేదీన జరిగే సమావేశంలో ఏ రెండింటిని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని, 9న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment