మీరు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నారో లేదో ఆత్మవిమర్శ చేసుకోండి
పనిచేయకపోతే భవిష్యత్‌లో నష్టపోతారు
కార్పొరేషన్ చైర్మన్లకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ క్లాస్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 43 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలున్నాయి. అందులో కార్పొరేషన్ చైర్మన్లుగా 40 మందికి అవకాశమిచ్చాం. సామాజిక, ప్రాంతీయ సమీకరణలతో పాటు సీనియారిటీ, శ్రమ ఆధారంగా అనేక వడపోతల తర్వాత మీకు చైర్మన్ పదవులొచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరంతా బాగా పనిచేశారు. మీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాల్సిన వారు కూడా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మీరు ఎలా పనిచేస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.
పార్టీ కోసం మీరేం చేస్తున్నారన్న సమాచారం ఎప్పటికప్పుడు మాకు వస్తోంది. పనిచేయకపోతే భవిష్యత్‌లో మీరే నష్టపోతారు.’అని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. 10 మంది చైర్మన్లు మాత్రమే చురుగ్గా పార్టీ కోసం పనిచేస్తున్నారని, సీఎం, మంత్రులు రోజుకు 18 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంటే మీరెంతసేపు పనిచేస్తున్నారంటూ మంగళవారం గాం«దీభవన్‌లో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లతో జరిగిన సమావేశంలో ఆయన క్లాస్ తీసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు పనికట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులేంటి? బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలేంటి? ఆ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలను వివరిస్తూ కార్పొరేషన్ చైర్మన్లకు సమాచారంతో కూడిన రిపోర్టులు అందజేశారు. సమావేశంలో భాగంగా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ తమ సమస్యలను పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ముందు ఏకరువు పెట్టారు.
తమకు గన్‌మెన్లను ఇంకా ఇవ్వలేదని, అటు శాఖాపరంగా, ఇటు నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం సరిపోవడం లేదని కొందరు, బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన కేసులను ఎత్తివేయించాలని మరికొందరు ఫిర్యాదు చేశారు. చైర్మన్ల సమస్యలు విన్న మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment