దిగాలుగా నిల్చున్న కళ్యాణ్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన యువకుడు కుడుముల కళ్యాణ్‌రెడ్డి తనకు తొలిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు. పోలింగ్ సమయం దగ్గర పడిన క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. అప్పటికే సమయం 6.08 గంటలు అయ్యింది.
ఓటర్ స్లిప్పుతో పోలింగ్ కేంద్రంలోని వెళ్తుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు అనుమంతిచలేదు. సమయం ముగిసినందున ఓటు వేయడం కుదరదని తేల్చిచెప్పారు. తనకు మొదటిసారి ఓటు వచ్చిందని అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు నిరాశతో వెనుదిరిగాడు.
ఒక్కరికి రెండు ఓట్లు!
మునుగోడు : అధికారుల తప్పిదాల వల్ల ఒక్క ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు వచ్చింది. దీంతో వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మునుగోడులోని పలు బూత్‌లలో ఒకే ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు ఓటరు లిస్టులో ముద్రించారు. మునుగోడులోని బూత్ నంబర్ 155లో క్రమ సంఖ్య 902లో కట్ట పవిత్రకు ఓటు హక్కు ఉన్నట్లు ఓటరు లిస్టులో ఉంది. అదే ఓటరు పేరు తిరిగి 903 క్రమ సంఖ్యలో కూడా ఉండటంతో ఆ యువతి ఓటు వేసేందుకు అభ్యంతరం వ్యక్తమైంది.
చివరికి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ బూత్ ఏజెంట్లతో మాట్లాడి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. అదే గ్రామంలోని పందుల పవన్‌కు 155 బూత్‌లోని 927 క్రమ సంఖ్యలో ఓటు హక్కు ఉంది. అదే యువకుడికి బూత్ నంబర్ 152లో కూడా ఉండటంతో అతడు ఏ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment