సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా వ్యక్తీకరణ బాగా చేసి చూపించ లేకపోవడంతో నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉంది. అందరితో తిట్లు తింటున్నాం. ఈ నేపథ్యంలో కొన్ని సంజాయిషీలు, వివరణలు ఇచ్చేందుకే ఉద్యోగార్థులతో ఇటీవల భేటీ అయ్యాం. వాస్తవానికి దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు, ఇతర అవాంతరాలను అధిగమించి యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తాం..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రేవంత్, సంజయ్ ఎంట్రన్స్‌లు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నారా?
‘టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని గుర్తించి చర్యలు తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. నేను అనేక ఎంట్రన్స్‌లు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నా. చదువుకుని ఉద్యోగాలు చేశా. రేవంత్, బండి సంజయ్ లాంటి వారు ఎప్పుడైనా ఇలాంటివి ఎదుర్కొన్నా రా? దేశంలో మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచి్చన రాష్ట్రాలు లేవని మోదీ, రాహుల్‌కు సవాలు చేస్తు న్నా. ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నిరుద్యోగుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. కేంద్రంలో 59 లక్షల ఉద్యోగాలు ఉంటే, రాష్ట్రంలో ఉన్నవి ఏడున్నర లక్షలు మాత్రమే. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నార నేది అవాస్తవం, వారి సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు ఉండొచ్చు..’ అని కేటీఆర్ చెప్పారు.
సాధించాల్సింది ఇంకా ఉంది
‘స్థిరత్వం, సమర్ధత, నమ్మకత్వం, పనితీరు, తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం పెంచడం వంటివి మేము సాధించాం. తెలంగాణలో మేము తెచి్చన మార్పు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టం ప్రజలకు విడమరిచి చెప్తున్నాం. ‘సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది’ అనేది మా నినాదం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాని రీతిలో ఉన్నాయి. కోవిడ్ వల్ల రాష్ట్ర బడ్జెట్‌కు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. సంక్షేమ పథకాలు కొనసాగించడం వల్ల ఇతర పనులు కొంత మందగించాయి. రక్షణ శాఖ భూములు కేటాయించి ఉంటే పాట్నీ, జేబీఎస్ స్కైవేలు పూర్తి చేసి ఉండేవాళ్లం. హైదరాబాద్‌లో రోడ్లు, కరెంటు తదితరాలు బాగు చేశాం. డ్రైనేజీ, వరద నీటి వ్యవస్థను ఇంకా మెరుగ్గా చేయాల్సి ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే మూసీ సుందరీకరణ, వరద నీటి నిర్వహణ పనులు చేస్తాం. కాళేళ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే పేదరికం తొలిగిపోతుంది..’ అని అన్నారు.
సోనియా సరిగా హ్యాండిల్ చేయలేదు
‘కాంగ్రెస్‌లో మా పార్టీ విలీన ప్రతిపాదనను సోనియా సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్లే మేము ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చాం. నేను మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదు. కుటుంబ పార్టీ విమర్శలు వస్తాయని కేసీఆర్‌కు చెప్పినా ఆయన తోసిపుచ్చి మంత్రిని చేశారు. మునుగోడులో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు నీరు అందించడం నా జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం..’ అని కేటీఆర్ చెప్పారు. తమపై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. ‘మాపై దుర్భాషలాడు తున్న ప్రతిపక్షాలను తొక్కేసి ఉండాల్సింది. జర్నలిస్టుల ముసుగులో యూ ట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రతికూల ఎజెండాను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ఉండాల్సింది...’ అని వ్యాఖ్యానించారు.
కుంభకోణాలకు చిరునామాగా మార్చేందుకా?
‘మార్పు కోసం అధికారం ఇవ్వాలని కోరుతున్న వారు.. ఆరు నెలల్లో సీఎంని మార్చేందుకా, కుంభకోణాలకు చిరునామాగా మార్చేందుకా? ఎందుకో చెప్పాలి. గుజరాత్‌లో బీజేపీ ఐదుమార్లు గెలిచినప్పుడు, 50 ఏండ్లు కాంగ్రెస్ అధికారం చెలాయించినపుడు మార్పు అవసరం అనిపించలేదా? ప్రజలు ప్రగతికి, సానుకూల రాజకీయాలకే ఓటు వేస్తారు. మేము బీజేపీ సహా ఏ పార్టీకి బీ టీమ్ కాదు. మేము జాతీయ రాజకీయాల్లోకి విస్తరించకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలు ఇవి. 2014, 2018 లోనూ మేము ఓడిపోతున్నామంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు వంటి నేతలు రూ.500 కోట్లతో వచ్చి మహాకూటమి ఏర్పాటు చేయడం వంటివి చూశాం. ఇప్పుడు కూడా ఏదో జరుగుతుందని అపోహలు సృష్టించడం కాంగ్రెస్ గేమ్‌ప్లాన్‌లో భాగం. మేం 70 నుంచి 82 స్థానాల్లో గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయి. సొంతంగానే మెజారిటీ సాధిస్తాం. అనుకున్నది సాధించే నైజం కలిగిన కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధిస్తాం. ఐదు అంచెల పాలన వ్యవస్థ ఉన్న చోట సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదు. అయినా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ప్రజా దర్భార్’ నిర్వహిస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment