విశాఖపట్నం: భారతదేశంలో నదుల చరిత్ర పురాతనమైనది. గొప్పది.. గంగా వంటి పవిత్ర నదుల గురించి గ్రంథాలు, పురాణాల్లో ప్రస్థావన ఉంది. దేశంలో గంగా, గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర మొదలైన నదులన్నీ మహిళల పేర్లతోనే ఉంటాయి. ఈ కారణంగానే నదిని తల్లిగా, పవిత్రంగా పూజిస్తాం. నదులు మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి. ఎన్నో గొప్ప నాగరికతలు నది ఒడ్డునే పుట్టాయి.
ఇప్పుడు నదుల ప్రస్తావన ఎందుకని అంటారా? విశాఖ కేంద్ర కారాగారం లోపల దేశంలో ప్రవహిస్తున్న నదుల పేర్లే కనిపిస్తాయి. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది నోట ఆ పేర్లే వినిపిస్తాయి. ఇక్కడ బ్లాక్‌లకు నదుల పేర్లు పెట్టి.. వాటి గొప్పతనాన్ని చాటి చెప్పారు జైలు అధికారులు. సుమారు 100 ఎకరాల్లో విశాఖ కేంద్ర కారాగారాన్ని నిర్మించారు. దీని సామర్థ్యం 914 మంది. అయితే ప్రస్తుతం రిమాండ్, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ సుమారు 1,900 మంది వరకు ఉన్నారు.
సెంట్రల్ జైలులో 21 బ్లాక్‌లు ఉన్నాయి. ఆయా బ్లాక్‌లకు దేశంలో ఉండే ప్రముఖ నదుల పేర్లు పెట్టారు. గంగా, నర్మద, చిత్రావతి, ప్రాణహిత, శబరి, గోస్తని, స్వర్ణముఖి, తపతి, కావేరి, తుంగభద్ర, వంశధార, గోదావరి, కృష్ణవేణి, అన్నపూర్ణ, పెన్నా, నాగావళి తదితర పేర్లతో పిలుస్తారు. గంగా, కృష్ణవేణి బ్లాక్‌ల్లో రిమాండ్ ఖైదీలు ఉంటారు. నర్మదా బ్లాక్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఖైదీలను పెడతారు. చిత్రావతి బ్లాక్‌ను మావోయిస్ట్ ఖైదీల కోసం కేటాయించారు. సువర్ణముఖిలో మహిళా ఖైదీలు ఉంటారు. గోదావరి బ్లాక్‌లో శిక్ష పడిన ఖైదీలను ఉంచుతారు. దీన్ని ప్రధానమైన బ్లాక్‌గా పరిగణిస్తారు.
తపతి, కావేరి, పెన్నా బ్లాక్‌లను ఖైదీల సెల్ కోసం వినియోగిస్తున్నారు. స్నేహ సరోవర్‌లో అడ్మిషన్లు, శాంతివనం, గోస్తనీ బ్లాక్‌లను ఆడిటోరియం, శబరిని సిబ్బంది కిచెన్‌కు, అన్నపూర్ణ బ్లాక్‌ను ఖైదీల కిచెన్‌కు ఉపయోగిస్తున్నారు. నాగావళి, వంశధార, తుంగభద్ర బ్లాక్‌లను ఓపెన్ ల్యాండ్‌గా విడిచిపెట్టారు. ప్రాణహితను ఖైదీల వైద్య చికిత్సలకు, జ్ఞాన సాగరంను లైబ్రరీ, ఖైదీలకు పాఠశాలగా వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీ బ్లాక్‌లో వివిధ పశ్రమలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఖైదీలు పనిచేస్తారు. స్కిల్ డెవెలప్‌మెంట్ బ్లాక్‌లో ఖైదీలకు టైలరింగ్, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర చేతి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పుతున్నారు. ఈ బ్లాక్‌ల్లో ఎక్కువ శాతం దేశంలో ప్రవహించే నదుల పేర్లతో ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment