చేపల రేవు చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చేపల రేవు చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదం

Published Tue, Nov 21 2023 1:10 AM | Last Updated on Tue, Nov 21 2023 8:36 AM

- - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం తీవ్ర అలజడిని రేపింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంతో విశాఖ ఉలిక్కి పడింది. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ చేపలరేవులో అతి పెద్ద అగ్ని ప్రమాదం ఇదే. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే నగరంలోని మత్స్యకారులు పిల్లా పాపలతో హార్బర్‌కు పరుగులు తీశారు. అలా సోమవారం మధ్యాహ్నం వరకు వీరు చేపలరేవుకు వస్తూనే ఉన్నారు. మంటల్లో కాలిపోయిన బోట్లను చూసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

తాము రూ.లక్షల్లో అప్పు చేసి బోట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు మంటల్లో కాలిపోయాయంటూ రోదించారు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చిన మత్స్యకారులతో పాటు అధికారులు, మీడియా ప్రతినిధులతో హార్బర్‌ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. తొమ్మిదేళ్ల క్రితం సంభవించిన హుద్‌హుద్‌ తుపానుకు 60 బోట్లు మునిగిపోగా మరో 200కి పైగా బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 36 బోట్లు పూర్తిగా, తొమ్మిది బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. దాదాపు పది బోట్లలో దించకుండా ఉంచిన టన్నుల కొద్దీ చేపలూ దగ్ధమయ్యాయి.

అగ్నికి ఆజ్యం ఇలా..
హార్బర్‌లో అగ్ని ప్రమాదం తీవ్రతరం కావడానికి మరిన్ని ఆజ్యం పోశాయి. లంగరు వేసి ఉన్న అన్ని బోట్లలో వందల నుంచి వేల లీటర్ల డీజిల్‌ ఉంది. బోట్లను ఫైబర్‌తో తయారు చేస్తారు. బోట్లలో నైలాన్‌ వలలు ఉంటాయి. అలాగే బోట్లు రాపిడికి గురి కాకుండా ఇరుపక్కల పాత టైర్లను అమరుస్తారు. చేపలవేటకు వెళ్లినప్పుడు బోటులో కలాసీలు వంట చేసుకోవడానికి రెండేసి గ్యాస్‌ సిలిండర్లు తీసుకెళ్తుంటారు. ఇవి బోట్లలోనే ఉంచుతారు. అగ్ని ప్రమాదం తీవ్రత పెంచడానికి ఇవన్నీ దోహదపడ్డాయి. అంతేకాదు.. ప్రమాదం ఇతర బోట్లకు వేగంగా విస్తరించడానికి గాలులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. హార్బర్‌లోని జీరో జెట్టీ ఆరో నంబర్‌ షాపు ఎదురుగా లంగరేసిన బాలాజీ బోటులో మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి నిమిషాల్లోనే పక్కనున్న బోట్లకు మంటలు వ్యాపించాయి. ఈశాన్య గాలుల దాటికి పశ్చిమ, వాయవ్య దిక్కుల్లో లంగరేసిన బోట్లు కొన్ని ఒకటో నంబర్‌ జెట్టీలో ఉన్న బోట్ల వైపు వెళ్లిపోయాయి. దీంతో అక్కడున్న పలు బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

యువకుల సాహసం
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న కొందరు మత్స్యకార యువకులు పరుగున హార్బర్‌కు చేరుకున్నారు. జెట్టీలకు కట్టిన తాళ్లను కోసివేసి బోట్లకు తాళ్లు కట్టి హార్బర్‌కు దూరంగా తీసుకెళ్లిపోయారు. దీంతో చాలా బోట్లను అగ్ని ప్రమాదం నుంచి కాపాడగలిగారు. లేదంటే మరిన్ని బోట్లు కాలిపోయి ఉండేవి.

ఇన్సూరెన్స్‌ లేదాయే..
మరోవైపు బోట్లకు ఏళ్ల తరబడి బీమా సదుపాయం లేదు. దీంతో ప్రమాదవశాత్తూ ఈ బోట్లు కాలిపోయినా, మునిగిపోయినా యజమానికి బీమా సొమ్ము రాదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు వీటికి ఇన్స్యూరెన్స్‌కు వీలుండేది. అయితే దేశంలో కొంతమంది తప్పుడు క్లెయిమ్‌లకు పాల్పడుతున్నారని తేలడంతో కేంద్రం బోట్లకు బీమా సదుపాయాన్ని ఎత్తివేసింది. అప్పట్నుంచి బోట్లు ఇన్సూరెన్స్‌కు నోచుకోవడం లేదు. బీమా సదుపాయం ఉండి ఉంటే ఈ ప్రమాదంలో కాలిపోయిన బోట్లకు పరిహారం అందేదని మత్స్యకారులు చెబుతున్నారు.

ఊపిరి పీల్చుకున్నా..
బోటు మీద వచ్చే ఆదాయంతోనే నా కుటుంబం జీవిస్తోంది. బోటు కాలిపోవడంతో రాత్రంతా నిద్ర లేదు. ఎలా జీవిస్తామన్న భయం కూడా వెంటాడింది. కాలిపోయిన బోటుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా ఆనందం వేసింది. ఈ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు.
– పోలయ్య, బోటు యాజమాని,

సీఎంకి ధన్యవాదాలు
గత 20 ఏళ్ల నుంచి ఫిషింగ్‌ హార్బర్‌లో బోటు నడుపుతున్నాను. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. హార్బర్‌లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఎవరో ఆకతాయులు చేసిన పనికి ప్రభుత్వం స్పందించి సహాయం అందించింది. ఊహించిన దాని కన్నా ప్రభుత్వం ఎక్కువగానే సహాయం చేస్తోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు ధన్యవాదాలు.

– యాగ శ్రీనివాసరావు, బోటు యాజమాని, 

No comments yet. Be the first to comment!
Add a comment
దగ్ధమైన బోట్లు, సామగ్రి 1
1/4

దగ్ధమైన బోట్లు, సామగ్రి

ఫిషింగ్‌ హార్బర్‌లో దగ్ధమైన బోట్లు 2
2/4

ఫిషింగ్‌ హార్బర్‌లో దగ్ధమైన బోట్లు

3
3/4

రోదిస్తున్న మత్స్యకారులు, సొమ్మసిల్లిన మహిళ 4
4/4

రోదిస్తున్న మత్స్యకారులు, సొమ్మసిల్లిన మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement