మాట్లాడుతున్న కలెక్టర్ మల్లికార్జున
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలందించాలని, రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున కోరారు. పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాలకు రుణ మంజూరు, సిబిల్ స్కోర్ విధానం, కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ, సీ్త్ర నిధి రుణ ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పాలసీకి అనుగుణంగా బ్యాంకర్లు వ్యవహరించాలని, ప్రజలకు సులభతర రీతిలో సేవలందించాలని సూచించారు. ప్రధానంగా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునే వారికి, జగనన్న పేదలందరికీ ఇళ్లు, టిడ్కో పథకంలో భాగంగా నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు రుణం మంజూరు చేసే క్రమంలో సిబిల్ స్కోర్ ఉండాలనే నిబంధనలో వీలును బట్టి సడలింపు ఇవ్వాలన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్లలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారికి సహకరించాలన్నారు. బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో వ్యవహరించి.. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్‌ను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. సమీక్షలో ఎల్‌డీఎం శ్రీనివాస్, ఆర్‌బీఐ ప్రతినిధి పూర్ణిమ, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ సమంత్ కుమార్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బ్యాంకర్లతో కలెక్టర్ మల్లికార్జున
Comments
Please login to add a commentAdd a comment