మద్యం సేవించి.. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు
● ఉన్నతాధికారులకు చిక్కిన పరవాడ ఎంపీడీవో? ● రక్త నమూనా సేకరించి, విచారణ చేపట్టిన అధికారులు
పరవాడ: పరవాడ ఎంపీడీవో శ్యామ్‌సుందర్ మద్యం మత్తులో ఉన్నతాధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఎంపీడీవో మద్యం సేవించి పాల్గొన్నట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఎంపీడీవో మాటలు తడబడటంతో మద్యం సేవించి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన తీరుపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు హుటాహుటిన ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని విచారణ జరిపారు. ఆయన ఎంపీడీవో మద్యం సేవించి విధులకు హాజరైనట్లు నిర్ధారిస్తూ, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. శ్యామ్‌సుందర్ చోడవరం ఎంపీడీవోగా పనిచేసి గతేడాది సెప్టెంబర్ 24న బదిలీపై పరవాడ వచ్చారు. బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. రోజూ మద్యం సేవించి విధులకు రావడం, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి చేష్టలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంపీడీవో విధులకు వచ్చే క్రమంలో మద్యం సేవించకుండా నియంత్రించేందుకు ఆయన భార్య, తల్లి వెంట రావడం పరిపాటిగా మారింది. బుధవారం ఆయన వెంట వీరిలో ఎవరూ లేకపోవడంతో మద్యం సేవించి కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయినట్లు తెలి సింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారితోపాటు సీఐ ఆర్.మల్లికార్జునరావు, ప్రభుత్వ వైద్య సిబ్బంది కార్యాలయానికి వచ్చి ఆయన రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై మండల ప్రత్యేక అధికారి వివరణ కోసం ప్రయత్నించగా ఫోన్‌కు అందుబాటులో లేరు. పరవాడ సీఐ మల్లికార్జునరావును వివరణ కోరగా విషయం వెల్లడించడానికి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment