దద్దరిల్లిన కలెక్టరేట్
● శానిటేషన్ వర్కర్స్, వీవోఏ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల నిరసన ● ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఆందోళన
మహారాణిపేట : ఉద్యోగులు, కార్మికుల నిరసనలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. వివిధ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఎలా బతికేది అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీవోఏలకు కూడా ఐదు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు రెండు నెలలుగా జీతాలు, మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడాన్ని సీఐటీయూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెప్పుకున్నారని, వాస్తవానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా కాదు కదా.. రెండు నెలలకొకసారి కూడా జీతాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వర్కర్లకు, వీవోఏలకు, మిడ్ డే మీల్ కార్మికులకు నెలల తరబడి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మిడ్ డే మీల్ మెనూ చార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ నాయకులు లక్ష్మి, సుజాత, మిడ్ డే మీల్ యూనియన్ నాయకులు ధనలక్ష్మి, భవాని, సావిత్రి, లక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న
సెవెన్ హిల్స్ కార్మికులు
‘సెవెన్ హిల్స్’ కార్మికులను తొలగించొద్దు
ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆస్పత్రి యాజమాన్యంతో కుమ్మకై ్కన పలు శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆస్పత్రి యాజమాన్యం 38 మంది హౌస్ కీపింగ్ కార్మికులను తొలగించడానికి నోటీసులు జారీ చేసిందని, వారిని విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాయకులు సుబ్బారావు, వై.రాజు, కార్మికులు పాల్గొన్నారు.
దళారీలు దోచేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అనంతరం అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచ్‌ల్లో దళారీలు దోచేస్తున్నారని, టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment