ఆర్టీసీ గ్యారేజీలో రాజకీయ ఉపన్యాసాలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ.. ప్రజలందరిది. సంస్థ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించడం, అందులో రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం.. కాంప్లెక్స్ ఆవరణలో బస్సులు నిలిపేందుకు వీలులేని విధంగా కార్లు నిలపడంపై ప్రయాణికులు దుమ్మెత్తిపోశారు. ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్‌గా జోనల్ కార్యాలయంలో సియ్యారి దొన్నుదొర మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చేవారి వాహనాలతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం నిండిపోయింది. కాంప్లెక్స్ లోపలకు బస్సులు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన గేటు నుంచే బస్సులు తిప్పేయడంతో ప్రయాణికులు రోడ్డుపైకి పరుగుతీసి బస్సులు ఎక్కాల్సి వచ్చింది. చైర్మన్ బాధ్యతల స్వీకరణ అనంతరం పక్కనే ఉన్న విజయనగరం డిపో గ్యారేజీలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభను నిర్వహించారు. సెక్యూరిటీ నిబంధనల మేరకు గ్యారేజీలో కార్మికులు, ఆర్టీసీ అధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాంప్లెక్స్ ప్రాంగణంలోకి కూడా ఇతరుల వాహనాలకు అనుమతి ఉండదు. ఇవేవీ పట్టించుకోకుండా గ్యారేజీ ప్రాంగణంలోనే భారీ బహిరంగ సభను నిర్వహించి రాజకీయ ఉపన్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి అధికమంది పార్టీ కార్యకర్తలు హాజరుకావడంతో గ్యారేజీలో విలువైన వస్తువులకు రక్షణ ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆర్టీసీ సిబ్బంది బహిరంగంగానే గగ్గోలుపెట్టారు. బాధ్యత స్వీకరణ కార్యక్రమం వరకే తమ షెడ్యూల్ అని మిగిలిన కార్యక్రమాల నిర్వహణతో ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యేకు అవమానం
ప్రాంతీయ ఆర్టీసీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతికి అవమానం జరిగింది. ఆహ్వాన ప్రధాన ప్రచార ముఖద్వారం పోస్టర్‌ల్లో ఆమె ఫొటో, పేరు ముద్రించలేదు. సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీ తదితర నాయకుల పేర్లు మాత్రమే వేశారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నా కార్యక్రమానికి గౌర్హాజరైనట్టు సమాచారం. ఆమె అనుచర వర్గం కూడా ఎవరూ హాజరుకాలేదు.
పాడేరుకు బస్సు సదుపాయం కల్పిస్తాం
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన దొన్నదొర మీడియాతో మాట్లాడుతూ త్వరలో జిల్లా కేంద్రం నుంచి అరకు మీదుగా పాడేరుకు బస్సు సదుపాయం
కల్పిస్తామన్నారు. ఆర్టీసీ నష్టాలను తగ్గించేందుకు సంస్థ ఉద్యోగుల సహకారం తీసుకుంటామన్నారు. రాష్ట్ర అర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లా డుతూ రాష్ట్ర రవాణా సంస్థను మరింతగా బలోపేతం చేసి రాష్ట్రంలో ప్రజా రవాణాను, ప్రయా ణాన్ని మరింత సులభతరం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ ఈడీ. పి.విజయకుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ, జిల్లా డీపీటీఓ కె.శ్రీనివాసరావు, అనకాపల్లి డీపీటీఓ కె.పద్మావతి, డిప్యూటీ సీఏఓ పి.వి. నాగేశ్వరరావు, డిప్యూటీ సీపీఎం సుధాబిందు, ఆర్టీసీ అధికారులు వరలక్ష్మి, ఐ.లక్ష్మీకాంత్, బి.రాజశేఖర్, కే.అరుణ్‌కుమార్, ఐ.దుర్గాప్రసాద్, విజయనగరం డిపోమేనేజర్ కె.శ్రీనివాసరావు, మన్యం జిల్లా డిపో మేనేజర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం–విశాఖ మధ్య నాన్ స్టాప్‌లుగా నడిపేందుకు రెండు ఆల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులను, శ్రీకాకుళం–విజయనగరం మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ నారాయణ, జోనల్ చైర్మన్ దొన్నుదొర ఆర్టీసీ డిపో గ్యారేజీ వద్ద ప్రారంభించారు. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు.
సెక్యూరిటీ నిబంధనలు పట్టించుకోని టీడీపీ నాయకులు
ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్‌గా దొన్నుదొర బాధ్యతల స్వీకరణ
గ్యారేజీలోకి భారీ సంఖ్యలో వాహనాలు
ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment