ఇవి ‘డయేరియా’ మరణాలు కావట...
గుర్ల గ్రామానికి చెందిన చింతపల్లి అప్పారావు (60) అక్టోబర్ 13న న చనిపోయాడు. అంతకు మూడు రోజుల కిందటే అతనిలో డయేరియా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. రోగం తగ్గిందని ఇంటికి వచ్చాడు. ఆ మరుసటి రోజు ఒక్కసారిగా వాంతులవడంతో అతన్ని కుటుంబసభ్యులు నెల్లిమర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో బయల్దేరారు. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ (50) అక్టోబర్ 14వ తేదీన డయేరియా బారినపడింది. తొలుత ఆమెకు గుర్ల ప్రాథమిక వైద్యకేంద్రంలో చికిత్స చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో వైద్యాధికారులు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ సుమారు 12 గంటల పాటు చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూనే అక్టోబరు 15న చనిపోయింది. ఆ విషాదంతోనే ఆమె కుమారుడు కలిశెట్టి రవి అదే నెల 18వ తేదీన మనోవేదనతో ప్రాణాలు వదిలేశాడు.
గుర్ల గ్రామానికి చెందిన సారిక పెంటయ్య (65) అక్టోబర్ 14న డయేరియా బారినపడ్డారు. ఆ మర్నాడు ఉదయమే ఆస్పత్రికి వెళ్దామని ఊరుకున్నారు. ఉదయానికల్లా వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో ఎక్కిస్తుండగానే మృతి చెందాడు.
గుర్ల గ్రామానికి చెందిన తోండ్రంగి రాము (50) అక్టోబర్ 15వ తేదీన డయేరియా బారినపడింది. అదే రోజు ఆమెను గుర్ల పీహెచ్‌సీకి కుటుంబసభ్యులు తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.
గుర్ల మండలం నాగళ్లవలస గ్రామానికి చెందిన బూరి సీతన్నాయుడు (30) డయేరియాతో అక్టోబర్ 14న విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ 16వ తేదీన మృతి చెందాడు.
గుర్ల గ్రామానికి చెందిన బోడసింగి రాములమ్మ (70)లో డయేరియా లక్షణాలు ఉండడంతో అక్టోబర్ 15వ తేదీన స్థానిక హైస్కూల్‌లోని వైద్య శిబిరానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. ఆ వైద్య శిబిరంలోనే రెండ్రోజుల పాటు చికిత్స పొందింది. ఆరోగ్యం మెరుగుపడిందని కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి మళ్లీ విషమించి అక్టోబర్ 17వ తేదీన మృతి చెందింది.
గుర్ల గ్రామానికి చెందిన పతివాడ సూరమ్మ (70) అక్టోబర్ 15న డయేరియా లక్షణాలతో స్థానిక హైస్కూల్‌లోని వైద్య శిబిరంలో చికిత్స పొందింది. మూడ్రోజుల పాటు శిబిరంలో ఉన్న ఆమె ఆరోగ్యం కాస్త మెరుగవ్వడంతో 17వ తేదీ రాత్రి కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కానీ గంటల వ్యవధిలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 18వ తేదీ ఉదయం చనిపోయింది.
గుర్ల గ్రామానికి చెందిన గుమ్మడి పైడమ్మ (66)కు అక్టోబర్ 15న డయేరియా లక్షణాలు కనిపించాయి. అదే రోజు ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా చనిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment