కోడ్‌ కూసింది | - | Sakshi
Sakshi News home page

కోడ్‌ కూసింది

Published Thu, Jan 30 2025 12:39 AM | Last Updated on Thu, Jan 30 2025 12:39 AM

కోడ్‌ కూసింది

కోడ్‌ కూసింది

షెడ్యూల్‌ ఇలా...

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది! బుధవారం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో అప్పటి నుంచే కోడ్‌ కూడా అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రకటించారు. మార్చి 8వ తేదీ వరకూ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. అప్పటివరకూ ఉత్తరాంధ్రలో భాగమైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండబోవు.

ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం మార్చి నెలలో ముగియనుండటంతో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేచింది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే షెడ్యూల్‌ విడుదలైప్పటి నుంచి మళ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకూ ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్‌) అమల్లో ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి నాలుగైదు నెలల క్రితం నుంచే హడావుడి మొదలైంది. ఓటర్ల నమోదు ప్రక్రియను పటిష్టంగా పూర్తి చేయడానికి కలెక్టరేట్‌లో ఎన్నికల విభాగం ప్రత్యేకంగా పనిచేసింది.

3 నుంచి హడావుడి...

శాసనమండలి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలకు వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీంతోనే ఎన్నికల హడావుడి మొదలవుతుంది. నాటి నుంచి పదో తేదీ వరకూ నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. 11న నామి నేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తదుపరి 27వ తేదీన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నిర్ణీత ఎన్నికల కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇదంతా సవ్యంగా పూర్తి అయితే ఎన్నికల ప్రక్రియ మార్చి 8వ తేదీతో ముగుస్తుంది. ఎన్నికల కోడ్‌ అప్పటివరకూ అమల్లో ఉంటుంది.

నోటిఫికేషన్‌ జారీ

3.2.2025 (సోమవారం)

నామినేషన్ల గడువు

10.2.2025 (సోమవారం)

నామినేషన్ల పరిశీలన

11.2.2025 (మంగళవారం)

నామినేషన్ల ఉపసంహరణ గడువు13.2.2025 (గురువారం)

పోలింగ్‌ తేదీ

27.2.2025 (గురువారం)

పోలింగ్‌ సమయం

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకూ

ఓట్ల లెక్కింపు

3.3.2025 (సోమవారం)

అమల్లోకి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌

అధికారిక కార్యక్రమాలకు బ్రేక్‌ బరిలోకి దిగేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు

ఎన్నికల సమరానికి సిద్ధం...

సిట్టింగ్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మరోసారి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏపీటీఎఫ్‌–257 (సింగరాజు వర్గం) అభ్యర్థి గా పోటీ చేయవచ్చు. పీఆర్‌టీయూ అభ్యర్థిగా బరిలోకి నిలిచేందుకు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నాయకుడు గాదె శ్రీనివాసులునాయుడు ఇప్పటికే సమాయత్తమవుతున్నారు. గతంలో రెండు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు ఉపాధ్యాయ వర్గాల్లో పేరుంది. ఏపీటీఎఫ్‌ –1938 (మాజీ ఎమ్మెల్సీ బాలకృష్ణమ్మ వర్గం)కు చెందిన ఆయనకు ఏపీ ఉపాధ్యాయుల సంఘం (ఏపీయూఎస్‌), ఏపీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఏపీటీఏ), బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ (బీటీఏ), గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం (ఏపీటీడబ్ల్యూఏఎస్‌)తో పాటు మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉందని శ్రీనివాసులునాయుడు చెబుతున్నారు. యూటీఎఫ్‌ నుంచి బొబ్బిలి ప్రాంతానికి చెందిన కె.విజయగౌరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, కె.విజయగౌరి... ఈ ముగ్గురూ విజయనగరం జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. తొలిసారిగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల సంఘం (ఏపీపీఎస్‌ఎంఏ) నుంచి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి నిలిచేందుకు విశాఖ జిల్లాకు చెందిన సుంకరి శ్రీనివాస్‌ సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement