వేటు తప్పదు
విజయనరం అర్బన్:
పనితీరు మెరుగుపర్చుకోని పంచాయతీరాజ్ ఇంజినీర్లు, ఉపాధి హామీ ఏపీఎంలను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్లూ హెచ్చరికలకే పరిమితం అయ్యామని, ఇకనుంచి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, గోకులాలు, పనిదినాల కల్పనపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఫేజ్ 1, 2, 3 పనులపై సమీక్షించారు. పనితీరు బాగులేని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలి పీఆర్ ఏఈ, సంబంధిత డీఈ, ఇద్దరు ఏపీఎంలకు షోకాజ్ నోటీసులకు సిఫార్స్ చేశారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు 280 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్లు, డ్రైన్లు తదితర 2,851 పనులను 3 దశల్లో మంజూరు చేసినట్టు కలెక్టర్ చెప్పారు. వీటిలో 1,171 పనులను మాత్రమే నేటివరకు పూర్తి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలల్లో కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తిచేశారని, నిధుల వినియోగం మరింత అధ్వానంగా ఉందన్నారు. జిల్లాకు మంజూరైన రూ.330 కోట్లను రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలన్నారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోతే వచ్చే ఏడాది నిధులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇక నుంచి ఈ పనులపై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా సమీక్షిస్తామని చెప్పారు. వచ్చేనెల 5వ తేదీలోగా జల్లాలో మంజూరైన గోకులాలన్నీ పూర్తి కావాల్సిందేనని, లేదంటే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఏపీఎంలకు స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ రేపు సాయంత్రంలోగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్, డ్వామా పీడీ ఎస్.శారదాదేవి, ఇతర అధికారులు, ఏపీఎంలు పాల్గొన్నారు.
పీఆర్ ఇంజనీర్లపై మండిపడిన కలెక్టర్
ఏపీఎంలపైనా తీవ్ర ఆగ్రహం
పనితీరు బాగులేని నలుగురిపై చర్యలకు ఆదేశం
ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment