బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం
కొత్తకోట: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో స్థానిక పురపాలికలో అభివృద్ధి శూన్యమని.. అప్పటి పుర చైర్మన్, ఎమ్మెల్యే చేసిందేమీ లేదని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పుర కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. మండల కేంద్రంగా ఉన్న కొత్తకోటను 2019లో పురపాలికగా మార్చారని, మొత్తం 17 అభివృద్ధి పనులను గుర్తించి ప్రభుత్వం రూ.19.80 కోట్లు మంజూరు చేయగా కేవలం 7 పనులు పూర్తిచేసి రూ.8 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. నిధులున్నా ఆ పార్టీ నేతలు కమీషన్లు రానిచోట పనులు నిలిపివేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. పట్టణంలో డివైడర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్పా పట్టణ వాసులకు కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. కొత్తకోటతో పాటు పరిసర గ్రామాల్లో కలిపి సుమారు లక్షకుపైగా జనాభా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిని కేవలం 6 పడకలకు మాత్రమే పరిమితం చేశారని చెప్పారు. త్వరలోనే 30 పడకలకు పెంచడంతో పాటు రూ.1.50 కోట్లతో బాలికల పాఠశాలను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే మరో రెండు నీటి ట్యాంకులను నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. పట్టణాభివృద్ధిపై కాంగ్రెస్‌కు మంచి ఎజెండా ఉందని.. ఐదేళ్లలో అన్నివిధాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ పవన్‌కుమార్, ఎంపీడీఓ చెన్నమ్మ, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు బీచుపల్లి, మేసీ్త్ర శ్రీనివాసులు, డా. పీజే బాబు, సాక బాలనారాయణ, కృష్ణారెడ్డి, బోయేజ్, మోహన్‌రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment