రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
వర్ధన్నపేట/రాయపర్తి: రైతులకు ఇబ్బంది కలిగించకుండా త్వరగా ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, రాయపర్తిలోని రెతువేదికలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, మొరిపిరాలలోని భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్వాహకులకు పలు సూచనలిచ్చారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలని, పత్తి కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, డీసీఓ నీరజ, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
అంకితభావంతో పనిచేయాలి..
వరంగల్: మండల ప్రత్యేక అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పురోగతిపై బుధవారం ప్రత్యేక అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని కేటాయించామని తెలిపారు. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారని, గడువులోగా 100 శాతం సర్వే పూర్తయ్యేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ గోవిందరాజన్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విజయాలు
వివరించేందుకే కళాయాత్ర..
ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించేందుకే ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను ప్రారంభించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఈనెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కళాయాత్ర వాహనాలను కలెక్టరేట్ ఆవరణలో బుధవారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28న, డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి అంతడ్పుల నాగరాజు, అలేఖ్య కళా బృందాలతో జిల్లాలో భారీ కళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఆర్వో అయూబ్‌అలీ, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment