భద్రకాళి పూడిక తరలింపు టెండర్ రద్దు
సాక్షిప్రతినిధి, వరంగల్ : భద్రకాళి చెరువునుంచి పూడిక మట్టి తరలింపు టెండర్‌ను నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం రద్దు చేశారు. రూ.9.51 కోట్లతో పనులు అప్పగించేందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చెరువులో రూ.3.49 కోట్ల విలువైన పూడిక తవ్వడం, లోడింగ్ పనిని ఖరారు చేయనున్న ఇరిగేషన్ అధికారులు.. మట్టి తరలింపు టెండర్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. పూడికతీత అనేది కీలకంగా మారడంతో ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
‘భద్రకాళి’ పూడికతీతకు బాలారిష్టాలు...
వరంగల్ మహా నగరపాలక సంస్థ సుమారు 50 సంవత్సరాల తర్వాత ఓరుగల్లు భద్రకాళి చెరువు పూడికతీతపై దృష్టి సారించింది. ఇందుకోసం నీరంతా ఖాళీ చేశారు. అంతకుముందే పూడికతీత పనుల కోసం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.13,00,09,046తో రెండు పనులకు నీటిపారుదలశాఖ ఈ నెల 5, 10 తేదీలలో టెండర్లు పిలిచింది. ఇందులో ఒక పని చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్ కోసం క్యూబిక్ మీటర్‌కు రూ.53 చొప్పున రూ.3,49,11,446లు కేటాయించారు. అదే విధంగా క్యూబిక్ మీటరుకు రూ.162.56ల చొప్పున 5.85 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తరలించేందుకు రూ.9,50,97,600లు చెల్లించేలా మరో పనికి టెండర్ పిలిచారు. మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే. పూడిక మట్టి తరలించే పనికి సంబంధించి ఈ నెల 17వ తేదీ నాటికి కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ మేరకు పూడికతీత, లోడింగ్, తరలింపు పనులను అత్యవసరంగా భావించిన అధికారులు రెండోసారి 27వ తేదీ గడువుతో టెండర్లు పిలిచారు. మంగళవారం టెండర్లు తెరిచిన అధికారులకు ఆన్‌లైన్‌లో ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. దీంతో ఈ టెండర్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.
రూ.3.49 కోట్ల పనులపై నేడు నిర్ణయం...
భద్రకాళి చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్ కోసం రూ.3,49,11,446ల పనులకు అధికారులు బుధవారం టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ పని కోసం ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ షెడ్యూల్ దాఖలు చేశారు. శ్వేత, జీఎన్ ఇన్‌ఫ్రా అనే సంస్థల దరఖాస్తులను పరిశీలించిన పిదప.. తక్కువ రేటు కోట్ చేసిన వారికి పనులు అప్పగించనున్నారు. పూడిక మట్టిని తరలించే పనులకు ఎవరూ ముందుకు రానందున.. అంతకుముందే చేపట్టే పూడిక తవ్వకం, లోడింగ్ పనులు ఖరారు చేసే విషయంలో కొంత తాత్సారం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపు పనుల టెండర్ నిబంధనల సడలింపు, కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించే అంశమై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇరిగేషన్ అధికారులు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకొనే నిర్ణయాలకు ఆనుగుణంగా మరోసారి టెండర్లు పిలిచే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
రూ.9.51 కోట్ల పనులకు
ముందుకురాని కాంట్రాక్టర్లు
పూడిక తీత, లోడింగ్‌కు
మాత్రం రెండు దరఖాస్తులు..
తక్కువ కోట్ చేసిన వారికి నేడు ఖరారు
Comments
Please login to add a commentAdd a comment