మూడుసార్లు.. ఆ నలుగురు | Sakshi
Sakshi News home page

మూడుసార్లు.. ఆ నలుగురు

Published Mon, May 6 2024 10:00 AM

మూడుస

సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఇన్నేళ్ల ఎన్నికల చరిత్రలో నలుగురు నేతలు మాత్రమే మూడుసార్లు ఎంపీలుగా విజయం సాధించారు. నల్లగొండ నియోజకవర్గానికి 1952 నుంచి ఎన్నికలు జరుగుతుండగా, 1962 నుంచి 2004 వరకు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మిర్యాలగూడ రద్దయ్యింది. మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని నల్లగొండ పరిధిలోకి రాగా, మిర్యాలగూడలోని నియోజకవర్గాలతోపాటు పూర్వపు వరంగల్‌ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి 2009లో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నల్లగొండ, పాత మిర్యాలగూడ, ప్రస్తుత భువనగిరి నియోజకవర్గాల్లో ఇప్పటివరకు నలుగురు నేతలు ఒక్కొక్కరు మూడుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు.

మిర్యాలగూడ నుంచి మరో ముగ్గురు

మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పన్నెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల మధ్యే కొనసాగింది. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు మూడుసార్లు గెలిచారు. 1971 ఎన్నికల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం నుంచి పోటీ చేసి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై విజయం సాధించి ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జీఎస్‌.రెడ్డి 1967 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి డీవీ.రావుపై మొదటిసారి విజయం సాధించారు. మళ్లీ ఆయనే 1977, 1980 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి భీమిరెడ్డి నర్సింహారెడ్డిపై గెలిచారు. ఇక 1989లో కాంగ్రెస్‌ నుంచి బద్ధం నర్సింహారెడ్డి మొదటిసారి సీపీఎం అభ్యర్థి భీమిరెడ్డి నర్సింహారెడ్డిపై గెలుపొందారు. 1996, 1998లోనూ మరో రెండుస్లారు బద్ధం నర్సింహారెడ్డి గెలుపొందారు.

రెండుసార్లు విజయం సాధించింది వీరే..

మిర్యాలగూడ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఎస్‌.జైపాల్‌రెడ్డి రెండుసార్లు గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, సురవరం సుధాకర్‌రెడ్డి రెండుస్లారు గెలుపొందారు. ఈ ముగ్గరూ సీపీఐ నేతలు కావడం గమనార్హం.

ఫ నల్లగొండ, మిర్యాలగూడ ఎంపీలుగా జీఎస్‌.రెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి,

బద్దం నర్సింహారెడ్డి విజయం

ఫ రద్దయిన మిర్యాలగూడ నుంచి జీఎస్‌.రెడ్డి, భీమిరెడ్డి, బద్ధం గెలుపు

ఫ నల్లగొండ నుంచి మూడు

పర్యాయాలు గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఫ ఎవరికీ దక్కని హ్యాట్రిక్‌ విజయం

మూడుసార్లు గెలిచిన ఘనత నలుగురికే..

వర్తమాన రాజకీయాల్లో జిల్లాలో మూడుసార్లు గెలిచిన ఘనతను సాధించింది గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరే కావడం విశేషం. పైగా పూర్తి కాలం ఎంపీగా ఆయన కొనసాగారు. ఆయన నల్లగొండ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. టీడీపీ తరఫున 1999 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుకుల జనార్దన్‌రెడ్డిపై 79,735 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. తరువాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్‌రెడ్డిపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచే రెండోసారి 2014 ఎన్నికల్లో బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి తేరా చిన్నప రెడ్డిపై 1,93,156 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి కేవలం సుఖేందర్‌రెడ్డి మాత్రమే మూడుసార్లు గెలిచారు.

మూడుసార్లు.. ఆ నలుగురు
1/3

మూడుసార్లు.. ఆ నలుగురు

మూడుసార్లు.. ఆ నలుగురు
2/3

మూడుసార్లు.. ఆ నలుగురు

మూడుసార్లు.. ఆ నలుగురు
3/3

మూడుసార్లు.. ఆ నలుగురు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement