సి.రామచంద్రయ్య, జి.ద్వారకనాథరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.'
- చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు.
రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నాడు వైఎస్సార్ దీవెనలతో..
వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం.
టీడీపీకి కొత్త తలనొప్పి
రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్‌సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment