టీడీపీ టికెట్‌ కోసం ఇంతటి దిగజారుడా? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ టికెట్‌ కోసం ఇంతటి దిగజారుడా?

Published Mon, Jan 22 2024 1:16 AM | Last Updated on Mon, Jan 22 2024 11:37 AM

- - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : టీడీపీ టికెట్‌ కోసం ఆ పార్టీ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు దిగజారి తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్లకల్యాణ మండపంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ టికెట్‌ను ఆశించే వీరిద్దరి అసత్యపు మాటలకు హద్దూ అదుపు లేకుండా పోయిందన్నారు.

ప్రొద్దుటూరులో వీళ్లకి ఉనికి ఉందని చెప్పుకోవడానికి, చంద్రబాబును ఆకర్షించేందుకు ఎంతటి అబద్దానైన్నా ఆడటానికి వెనకాడటం లేదన్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఏ రోజూ ప్రజల కోసం తహసీల్దార్‌ ఆఫీసు, మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లలేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేయలేదని చెప్పారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏది జరిగినా దానికి ఎమ్మెల్యే కారణమని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఆలోచన చేయకుండా బరి తెగించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో పోలీసులు దాడులు నిర్వహిస్తే తన ప్రమేయంతోనే ప్రొద్దుటూరులో దాడులు చేస్తున్నారని టీడీపీ నాయకులిద్దరూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఇలా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు.

గతంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత విస్తృతంగా తనిఖీలు జరిగేవని, అయితే ఈ సారి నెల రోజులు ముందుగానే పోలీసులు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరుతో పాటు జిల్లాలోని పులివెందుల, మైదుకూరు, కడప, బద్వేలు, కమలాపురం ప్రాంతాల్లో తనిఖీలు చేసి బిల్లులు లేని కోట్లాది రూపాయలను సీజ్‌ చేశారన్నారు.

ప్రొద్దుటూరులో బిల్లులు లేవనే కారణంతో రెండు చోట్ల పోలీసులు నగదును సీజ్‌ చేసిన విషయం తెలుసుకొని జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే మొదట స్పందించింది తానేనని ఎమ్మెల్యే తెలిపారు. మళ్లీ రెండు రోజుల తర్వాత బంగారు అంగళ్ల వద్ద డబ్బు పట్టుకున్న సంఘటనపై బంగారు వ్యాపారులు పలువురు తనను ఆశ్రయించగా వారికి సంఘీభావం తెలిపానన్నారు.

ఎన్నికల కోడ్‌ రాకముందే వ్యాపారులు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసు, ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశానని చెప్పారు. ఈ విషయమై మాట్లాడటానికి మంగళవారం డీజీపీ అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నానని తెలిపారు. కుమార్తె పెళ్లికి బంగారు చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రూ. 14.50 లక్షలు పోలీసులు సీజ్‌ చేస్తే తాను టూ టౌన్‌ పోలీస్‌స్షేషన్‌కు వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పెళ్లికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ డబ్బు తానిస్తానని కూడా వారికి చెప్పానన్నారు. టూ టౌన్‌ సీఐ ఇబ్రహీంపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పని గట్టుకొని ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. సీఐ ఇబ్రహీం ముస్లిం కావడంతోనే విమర్శలు చేస్తున్నారని, మైనార్టీలంటే ఆయనకు చిన్న చూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని ఎమ్మెల్యే అన్నారు.

టీడీపీ నాయకులు చెబుతున్న అసత్యాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లె లక్ష్మీదేవి, సగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మురళి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement