సాక్షి ప్రతినిధి, కడప: గడప గడపకు ప్రభుత్వం పేరిట వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు ఇల్లిల్లు తిరిగారు. వైఎస్సార్ ఆసరా పేరిట అక్కచెల్లెమ్మలను పలకరిస్తున్నారు. దీంతోపాటు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఐదేళ్ల ప్రభుత్వ పాలన ఆధారంగా ఓట్లు వేయాలని ధైర్యంగా కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో జిల్లాలోని టీడీపీలో అయోమయం నెలకొంది. ఇన్‌చార్జీలకు అసలు సీటు ఉందో లేదో తెలియదు. అయినా కొందరు ఇన్‌చార్జీకి తెలియకుండానే చంద్రబాబు సమక్షంలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ష్యూరిటీ సరే, మా భవిష్యత్‌కు లేదు క్లారిటీ అంటూ పలువురు నేతలు మదనపడుతున్నారు.
► తెలుగుదేశంపార్టీలో జెండా మోసినోళ్ల కంటే ధనవంతులకే ప్రాధాన్యత లభిస్తోంది. ఎక్కడ తూకం ఎక్కువ ఉంటే అటువైపు అధినేత మొగ్గు చూపే పరిస్థితి కన్పిస్తోంది. ఈక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జీకి తెలియకుండానే, చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు పార్టీలో చేరుతున్నారు. ఐదేళ్లుగా ఇన్‌చార్జీగా ఉన్న నేతల కంటే ఇటీవల పార్టీలో చేరిన నాయకులు టికెట్ హామీతోనే పార్టీలో చేరినట్లు వారి అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. మరోవైపు తెరవెనుక మంత్రాంగం నిర్వహిస్తూ వర్గ సమీకరణకు పాల్పడుతుండటంతో వారి మాటలకు మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
► మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, ద్వారకనాథరెడ్డిలు ఇటీవల టీడీపీలో చేరారు. ఇద్దరు కూడా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జీలు పుత్తా నరసింహారెడ్డి, ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి ప్రమేయం లేకుండానే అధినేత వద్ద పచ్చ కండువా కప్పుకున్నారు. తర్వాత నియోజకవర్గాల్లోకి వచ్చిన వారిద్దరు అనుచరులతో టికెట్ తమకే వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆనక తెరవెనుక మంత్రాంగం నిర్వహిస్తూ వర్గ సమీకరణ చేస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన నేతలకు టికెట్ ఇచ్చేది లేదని, ఇదివరకే నారాలోకేష్ ఒంగోలులో పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఇవన్నీ బేరీజు వేసుకుంటూ తమకే టికెట్ దక్కుతుందనే ధీమాను మాజీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆ రెండు చోట్లనే కాకుండా కడప, ప్రొద్దుటూరులో ఎవరికి వారు తామే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా పోస్టర్లు కూడా వేసుకున్నారు. రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేల్‌లో 2019లో పోటీ చేసిన నేతలతో నిమిత్తం లేకుండా కొత్తవారి పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తెలుగుతమ్ముళ్ల మధ్య గందరగోళం నెలకొంది.
వైఎస్సార్‌సీపీకి అపార మద్దతు
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంతజిల్లా.. వైఎస్సార్‌సీపీకి అపార ప్రజామద్దతు ఉన్న ప్రాంతం. నలుదిశలా విశేష అభివృద్ధి చోటు చేసుకుంది. మరోవైపు ఐదేళ్ల పాలనలో మీకు మంచి చేసి ఉంటే ఓటెయ్యండని వైఎస్సార్‌సీపీ ప్రజలను కోరుతోంది. దమ్ము..ధైర్యం ప్రకటిస్తున్న అధికార పార్టీని ఢీ కొనడం ఎలా అన్న సందిగ్ధత ఆయా పార్టీల ఆశావహులను వెంటాడుతోంది. కనీసం అభ్యర్థిత్వంపై క్లారీటీ ఇస్తే ప్రజల మధ్యకు వెళ్లి వ్యక్తిగతంగా ఓ అవకాశం ఇవ్వమని కోరుదామన్నా, సవాలక్ష అడ్డంకులు సృష్టిస్తున్నారని పలువురు మదనపడుతున్నారు. ‘బాబు ష్యూరిటీ...భవిష్యత్ గ్యారెంటీ’పేరుతో ఇంతకాలం కార్యక్రమాలు చేశాం. ఎన్ని మాటలు చెప్పి నా ప్రజల్లో ఆశించిన స్పందన లేదు. ప్రజల భవిష్యత్ ఏమో గానీ, మా భవిష్యత్‌కు క్లారిటీ లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment