జీవన ప్రయాణంలో అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసొస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. పొరపాటున ఊహించని సంఘటన ఏదైనా జరిగి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అదే నిరు పేదల పరిస్థితైతే వర్ణణాతీతం. అలాంటి పేద కుటుంబాల దిగులు తీర్చి ధీమా నిస్తోంది వైఎస్సార్ బీమా పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
కడప రూరల్: పేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. అనుకోని విధంగా ప్రమాదం జరిగినపుడు ఎవరూ ఆదుకోరనే భయాన్ని పోగొట్టారు. దీంతో నిరుపేదలకు భరోసా లభించింది. ప్రభుత్వం 2020 అక్టోబరు 22న రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్‌కార్డు కలిగిన 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ప్రజలందరూ ఈ పథకానికి అర్హులు.
ప్రమాదవశాత్తు మరణించినా, వృద్ధాప్య తదితర సహజ కారణాలతో మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా ఈ పథకం ద్వారా బాధిత కుటంబానికి ఆర్థికసాయం లభిస్తుంది. కుటుంబంలో నామినీగా ఉన్న వ్యక్తికి బీమా నగదు అందుతుంది. ఆ ప్రకారం ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, 18–50 ఏళ్లలోపు సహజ మరణం పొందిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందుతుంది. తక్షణ సాయంగా దహన సంస్కారాలకు రూ. 10 వేలను అందజేస్తారు.
566 కుటుంబాలకు ప్రయోజనం
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ బీమా కింద సహజ మరణాలకు సంబంధించి 572 నమోదయ్యాయి. అందులో ఒకరికి రూ. ఒక లక్ష చొప్పున 481 కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ 4.81 కోట్లు బీమా సొమ్మును అందజేసింది. అలాగే వివిధ ప్రమాదాల్లో 111 మంది మృత్యువాతపడగా, అందులో ఒకరికి రూ 5 లక్షల చొప్పున 85 మందికి మొత్తం 4.25 కోట్ల బీమా సొమ్ము లభించింది.
మొత్తం 683 మందికిగాను 566 కుటుంబాలకు చెందిన నామినీలకు మొత్తం రూ.9.06 కోట్ల ప్రయో జనం చేకూరింది. బీమాకు సంబంధించిన పత్రాలను సమర్పించిన 21 రోజుల్లోపే ప్రభుత్వం నామినీ ఖాతా లకు సొమ్మును జమ చేయడం ప్రశంసనీయం. దీంతో బాధిత కుటుంబాలకు దిగులు తీర్చి బీమా ద్వారా ధీమాను కలిగించినట్‌లైంది. ఈ పథకం అమలు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
1. పిల్లలతో ఉన్న ఈమె పేరు మూడే అరుణ. భర్త శ్రీను నాయక్. చేపలు పట్టేవారు. వారు మైదుకూరులో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఓ రోజు శ్రీనునాయక్ చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా నీళ్లలో పడి మృతి చెందాడు.
దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాంటి కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం వెలుగులు నింపింది. తనకు అధికారులు వైఎస్సార్ బీమా కింద రూ 5 లక్షలు ఇచ్చారని అరుణ తెలిపింది. ప్రభుత్వం తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఙతలు తెలిపింది.
2. ఈమె పేరు మాండ్ల వరలక్ష్మి. కూలీ పనికి వెళుతుంది. భర్త శివప్రసాద్ హమాలీ పని చేçస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరిది రాజుపాళెం మండలం. వీరికి ఇద్దరు సంతానం. శివప్రసాద్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
ఈ తరుణంలో ఆ కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం కొండంత అండగా నిలిచింది. నామినీగా ఉన్న వరలక్ష్మికి ప్రభుత్వం రూ 5 లక్షలను అందజేసింది. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని ఆమె తెలిపింది.
3. ఈమె పేరు గోవిందు శ్యామల. కూలీ పనులకు వెళుతుంది. భర్త పేరు లక్షుమయ్య. మగ్గం పని చేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిది మూద్దనూరు మండలం. ఒక రోజు పొలంలో గడ్డి కో స్తుండగా లక్షుమయ్యను పాము కాటుతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది.
ఈ నేపథ్యంలో నామినీగా ఉన్న లక్షుమయ్య భార్య శ్యామలకు బీమా కింద రూ 5 లక్షలు వచ్చింది. బీమా కారణంగా తనకు ఆర్థిక సహయం కలిగిందని, ప్రభుత్వం తమ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేసింది.
వైఎస్సార్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి
తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి పెద్దకు ఏమైనా జరిగితే నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సమరి్పంచిన 21 రోజుల్లోనే నామినీకి క్‌లైమ్‌ను అందజేస్తాం. ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది.
– ఆనంద్ నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment