జజ్జనకర.. జాతర
లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు కమనీయంగా జరిగిన వేడుకలు ఆదివారం ముగిశాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఉత్సవ ప్రాంగణం కిక్కిరిసింది. అశ్వ వాహనంపై అమ్మవారి ఊరేగింపు ఉత్సాహ భరితంగా జరిగింది. వివిధ రంగులతో కూడిన చాందినీ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జబర్దస్త్ ఆర్కెస్ట్రా కార్యక్రమం అలరించింది. లక్కిరెడ్డిపల్లి జర్నలిస్టులు, మానవతా స్వచ్ఛంద సంస్థ, రాయచోటి మురళీ నవోదయ కోచింగ్ సెంటర్, ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, నీళ్ల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో.. తాగునీటి దాహార్తి నుంచి ఉపశమనం కల్గింది. గంగ జాతర అంటే చెరుకులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉత్సవానికి వచ్చిన భక్తులు చెరుకులు లేనిదే తిరుగు ప్రయాణం చేయరు. మిఠాయి దుకాణాలు, శీతల పానీయాలు దుకాణాల వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. బాణసంచా పేలుళ్లు చూపరులను ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారి దర్శనం కోసం రూ.10, రూ.100, రూ.300 టికెట్లతోపాటు వీఐపీ దర్శనం ఏర్పాటు చేసినా.. గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. జిల్లాతోపాటు పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి మొక్కులు ఉన్న వారు బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. పలువురు ప్రముఖులు గంగమ్మ దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ కుమార్, వెంకటేష్, గురుస్వామి, చంద్ర, రెడ్డి శేఖర్, బోస్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన గంగమ్మ ఉత్సవం
అశ్వవాహనంపై అమ్మవారి ఊరేగింపు
భక్తజన సంద్రమైన అనంతపురం
జజ్జనకర.. జాతర
Comments
Please login to add a commentAdd a comment