ప్రజలను బలి చేసిన బడ్జెట్ ఇది
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం రూ.3.24 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది బాహుబలి బడ్జెట్ కాదని...ప్రజలను బలిచేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి నిరూపితం అయిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతోపాటు 143 హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజల్ని మోసం చేశాడన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పాడని, ఎక్కడ సృష్టించాడో, ఏ విధంగా సృష్టించాడో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలకు మాత్రమే సంపద సృష్టి జరిగిందని, కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకూ వారి స్వలాభానికే సంపద సృష్టి జరిగిందన్నారు. గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పింఛన్లతో మమ అనిపించాడని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఆ పింఛన్లలో కూడా కోత విధించేలా ఉన్నారన్నారు. పింఛన్లకు రూ.4వేల కోట్లు తక్కువగా కేటాయింపులు చేశారని, సుమారు 10 లక్షల పింఛన్లు కోత కోసేందుకు సర్వేలు వాయు వేగంతో చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి అని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని గొప్పలు చెప్పారని, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేకుండా చేశారన్నారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించి 80 లక్షల మంది పిల్లలకు 12వేల కోట్లు కావాల్సి ఉంటే...9వేల కోట్లే బడ్జెట్‌లో కేటాయించారన్నారు. ఆ రూ. 9వేల కోట్లయినా సరైన విధంగా ఇస్తాడా... అనే అనుమానం ఉందన్నారు. అన్నదాత సుఖీభవకు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా అదనంగా రూ. 20 వేలు ఇస్తానని ఇప్పుడు మార్చారన్నారు. చంద్రబాబు చేష్టలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. 2024 నవంబర్ బడ్జెట్‌లో వ్యాల్యూమ్–6లో రూ.6.46 కోట్ల అప్పులు చూపారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగిపోయే నాటికి రూ.3.1 6లక్షల కోట్లు అప్పు ఉండేదన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో వ్యాల్యూమ్–6 కాలమ్‌నే తొలగించారని ఎత్తిచూపారు. ఈ 9 మాసాలకే రూ. 1.30 లక్షల కోట్ల అప్పు చేశాడని, వచ్చే ఏడాది మరో లక్ష కోట్ల అప్పు చేస్తారని బడ్జెట్ ద్వారా అర్థమవుతోందన్నారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమకుగానీ, గాలేరు నగరి, హంద్రీనీవా, అన్నమయ్య ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ముగ్గరూ కలిసి ఇవే హామీలను ప్రజలకు చెప్పారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 30వేల కోట్ల బకాయిలను పట్టించుకోలేదని, పీఆర్సీ గురించి చర్చే లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమం కోసం అప్పులు చేశారని, ఈ ప్రభుత్వం అవేమీ చేయకుండానే రూ.1.30 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ వారికి చిన్న పని చేసినా ఊరుకోను అంటూ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం దారుణమన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ కులం, మతం, వర్గం లేదు..పార్టీ అంతకన్నా లేదని అందరికీ సంక్షేమాన్ని అందించారన్నారు. చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ.8వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారన్నారు. పోసాని కృష్ణమురళి ఎప్పుడో 2021లో మాట్లాడితే.. ఇప్పుడు తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని, అంతకు ముందు టీడీపీ నేతలు ఎన్ని బండ బూతులు తిట్టారో మేము చూపిస్తామన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వీళ్లను చొక్కాపట్టుకొని నిలదీసే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతలు పులి సునీల్ కుమార్, నాగేంద్రారెడ్డి, ఎస్‌ఎండీ షఫీ, శ్రీరంజన్‌రెడ్డి, సాయి, సాయిదత్త పాల్గొన్నారు.
అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు
బ్రాండ్ అంబాసిడర్
వైఎస్సార్‌సీపీ వారికి ఏ పనులు
చేయవద్దని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనడం దారుణం
వీళ్లను చొక్కాపట్టుకొని నిలదీసే
రోజు వస్తుంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment