గన్నే నీకు ఇది తగునా..!
రాజంపేట టౌన్ : తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడు తమకు చెందిన భూముల్లో సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి రానివ్వకుండా ఇతరుల ద్వారా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని కొల్లావారిపల్లె మిట్టదళితవాడకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత దళితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం వారి పంట పొలాల వద్ద గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూ లబ్ధిపొందిన వారి కుటుంబాలకు చెందిన జయరామయ్య, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య విలేకరులతో మాట్లాడారు. రాజంపేట మండలం గోపమాంబపురం రెవెన్యూ పొలంలోని సర్వే నంబర్ 20/24లో 1.50 ఎకరాల భూమిని 2023వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మన్నెం లక్షుమ్మకు అసైన్‌మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందన్నారు. ఈభూమి గతంలో లక్షుమ్మ అవ్వ గంగమ్మ పేరిట ఉండేదన్నారు. అలాగే 20/25 సర్వే నంబర్‌లోని 1.50 ఎకరాల భూమి కొట్టం దుర్గాకు, 20/26 సర్వే నంబర్‌లోని 50 సెంట్ల భూమిని మన్నెం పద్మకు ప్రభుత్వం అసైన్‌మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిందని తెలిపారు. దీంతో తమ భార్యల పేరిట ఉన్న ఈ భూముల్లో తాము పంటలు పెట్టి సాగుచేసుకుంటుండగా గన్నే సుబ్బనరసయ్యనాయుడు అండతో చవన పీరయ్యనాయుడు తమ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని తమను భూముల్లోకి రానివ్వడం లేదని వారు ఆరోపించారు. 2023వ సంవత్సరంలో అసైన్‌మెంట్ కమిటీ ద్వారా తమకు కేటాయించిన భూములకు విద్యుత్‌శాఖ అధికారులు పీరయ్యనాయుడు పేరుతో విద్యుత్ కనెక్షన్‌ను ఇచ్చారని, ఈవిషయాన్ని తాము గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా అఽధికారులు పీరయ్యనాయుడు పేరిట ఉన్న కనెక్షన్‌ను తొలగించారని తెలిపారు. అయితే మళ్లీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గి పీరయ్యనాయుడుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారన్నారు. దీంతో గన్నే సుబ్బనరసయ్యనాయుడు, పీరయ్యనాయుడులు తాము సాగుచేసుకుంటున్న పంట పొలాల్లోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ భూముల్లోకి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అలాగే తనపై ఆరోపణలు చేస్తే భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని గన్నే సుబ్బనరసయ్యనాయుడు ఇతరుల ద్వారా తమకు హెచ్చరికలు పంపుతున్నట్లు వారు తెలిపారు. సుబ్బనరసయ్యనాయుడు మేకవారిపల్లెలోని వంకపోరంబోకును ఆక్రమించుకొని షెడ్డు నిర్మించుకున్నాడని, అలాగే మిట్టమీదపల్లె మిట్టహరిజనవాడకు చెందిన గుడిసె సుబ్బరాయుడు, శెట్టిపల్లె నరసింహులు, కొండయ్య, మిట్టమీదపల్లెలోని సోమిగారి కుటుంబానికి చెందిన ఐదు ఎకరాల ఉరవడి చేనుకు గన్నే సుబ్బనరసయ్యనాయుడు దొంగపట్టాలు సృష్టించి ఆక్రమించుకున్నట్లు వారు ఆరోపించారు. గన్నే సుబ్బనరసయ్యనాయుడు రాజంపేట మండలంలో అనేకచోట్ల భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని, వాటన్నింటిని కూడా తాము సర్వే నెంబర్లతో సహా వె వెలుగులోకి తీసుకురానున్నట్లు వారు తెలిపారు.
దళితులను భయబ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు
సాగుచేసుకుంటున్న
భూముల్లోకి రానివ్వకుండా బెదిరింపులు
గన్నే సుబ్బనరసయ్యనాయుడు
దౌర్జన్యాలపై దళితుల నిరసన
మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment