
పసికందు మృతిపై ఆస్పత్రి వద్ద ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పసికందు మృతి చెందడంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గండికోట గ్రామానికి చెందిన గురుమోహన్ భార్య నాగేశ్వరి మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన వెంటనే పసికందు ఏడ్వకపోవడంతో 21న ప్రొద్దుటూరులోని పోసినా కాంపౌండ్‌లో ఉన్న వారాహి సూపర్ స్పెషాలిటి చిన్న పిల్లల హాస్పిటల్‌లో చేర్పించారు. పరిశీలించిన వైద్యుడు చికిత్సకు రూ. 25 వేలు అవుతుందని చెప్పడంతో గురుమోహన్ దంపతులు సరేనని చెప్పారు. ఐసీయూలో ఉంచి పసికందుకు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజులు గడిచిన తర్వాత బాలుడి ఆరోగ్యం కుదుట పడిందని, రెండు రోజులయ్యాక డిశ్చార్జి చేస్తానని వైద్యుడు చెప్పినట్లు గురుమోహన్ తెలిపారు. అయితే తర్వాత శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యుడు చెప్పారన్నారు. బయటికి వెళ్లడానికి కూడా సమయం లేదని చెప్పడంతో ఇక్కడే ప్రయత్నం చేయాలని గురుమోహన్ కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. అందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుందని వైద్యుడు చెప్పగా అందుకు అంగీకరించామన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శిశువు మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రూ. లక్షలు డబ్బు ఖర్చు చేసినా పసికందు తమకు దక్కలేదని రోదించసాగారు.
చేరినప్పటి నుంచి బాలుడిది సీరియస్ కండీషనే
హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి శిశువు సీరియస్ కండీషన్‌లోనే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు లోకేష్‌కుమార్ తెలిపారు. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు ఇన్‌ఫెక్షన్ కూడా ఎక్కువగా ఉందన్నారు. వచ్చిన వెంటనే ఫిట్స్ కూడా వచ్చాయన్నారు, ఈ పరిస్థితుల్లో ఎక్కడికై నా వెళ్లమని చెప్పామన్నారు. ముందుగా వెళ్తామని చెప్పిన గురుమోహన్ దంపతులు ఇక్కడే ఉంటామని చెప్పినట్లు డాక్టర్ చెప్పారు. ట్రీట్‌మెంట్ ప్రారంభించిన తర్వాత బాబు ఆరోగ్యం మెరుగుపడిందని, తల్లి పాలు తాగుతున్నాడని తెలిపారు. రాత్రి సమయాల్లో ఐసీయూలో, పగలు తల్లి వద్ద ఉంచామన్నారు. తల్లివద్ద ఉంటే వెచ్చదనం తగిలి బాలుడు త్వరగా కోలుకుంటాడని ఉద్దేశంతో చెప్పామన్నారు. అయితే తల్లి బాలుడిని సరిగా చూసుకోలేదని తెలిపారు. బాలుడిని ఫ్యాన్ కింద పడుకోబెట్టడంతో పూర్తిగా చల్లబడిపోయాడని, వెంటనే ఐసీయూలోకి తరలించామన్నారు. ఈ క్రమంలో బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు. బాలుడికి పూర్తి స్థాయిలో చికిత్స చేశామని, తమ చికిత్సలో ఎలాంటి తప్పులు దొర్లలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment